Sat Dec 06 2025 02:17:23 GMT+0000 (Coordinated Universal Time)
ఆందోళన విరమిస్తేనే మంచిది లేకుంటే?... సజ్జల వార్నింగ్
ఉద్యమం మొదలవ్వక ముందే చర్చలు ప్రారంభించి సమస్య పరిష్కరించాలని భావించామని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఉద్యమ కార్యాచరణ మొదలవ్వక ముందే చర్చలు ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని భావించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం కూడా చర్చలకు పిిలిచామన్నారు. సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని చెప్పామని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు పెట్టిన మూడు డిమాండ్లను పక్కన పెట్టి చర్చలకు వస్తే చాలా వరకూ సమస్యలు పరిష్కారమవుతాయని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. వారు ఆ మూడు డిమాండ్ల కోసమే పట్టుబడుతున్నారన్నారు.
ఎవరి మీద బలప్రదర్శన....
చలో విజయవాడ పేరుతో ఎవరి మీద బలప్రదర్శన చేస్తున్నారో చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందునే పోలీసులు అభ్యంతరం చెప్పి ఉంటారన్నారు. సమస్యలను పాయింట్ ల వారీగా చెప్పాలన్నారు. పాత జీతాలను చెల్లించేది లేదని చెప్పామని, మిగిలిన సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలకు రావాలని సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి పిలుపు నిచ్చారు. ఒక్కసారి ఐదు డీఏలో గతంలో ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికీ సిద్ధమే....
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా వారు కూడా సమ్మెకు మద్దతు పలకడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు తమ ఆందోళనలను విరమించి చర్చలకు రావాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని తెలిపారు. ఆ పరిస్థితి వరకూ రానివ్వవద్దని కోరారు.
Next Story

