Mon Feb 09 2026 18:19:52 GMT+0530 (India Standard Time)
BJP : "ఆది" వ్యాఖ్యలతో కూటమిలో ప్రకంపనలు
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలో ఇబ్బందికరంగా మారింది

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలో ఇబ్బందికరంగా మారింది. తిరుపతిలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆదినారాయణరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక కులం పెత్తనం ఏపీలో నడుస్తుందని ఆయన అనడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టినట్లయింది. ఆదినారాయణ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజికవర్గం పెత్తనం ఎక్కువ ఉందంటూ ఆయన నేరుగానే వ్యాఖ్యలు చేసి తన అసంతృప్తిని, అసహనాన్ని బయటపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులున్నాయా? అన్న దానిపై ఇప్పుడు కూటమిలోని మూడు పార్టీల్లో లోతైన చర్చ జరుగుతుంది.
అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన...
బీజేపీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఆదినారాయణ రెడ్డికి బహుశ ఉండదు. ఎందుకంటే ఏదైనా ఇటువంటి ఇబ్బందులుంటే అంతర్గత సమావేశాల్లో చర్చించాలి. కానీ నేరుగా ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆదినారాయణ రెడ్డి ఏదో మనసులో పెట్టుకుని అని ఉంటారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీల జమ్మల మడుగు నియోజకవర్గంలో నాడు టీడీపీలో పనిచేసి ప్రస్తుతం బేజేపీలో ఉన్న ఒక కీలక నేత కంపెనీ సామాగ్రపై ఆయన వర్గీయులు ఇటీవల దాడులు కూడా చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఆయన వెనక రాష్ట్ర టీడీపీ నేతలున్నారని ఆదినారాయణ రెడ్డికి ఏదైనా అనుమానం వస్తుందా? అన్నది కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కూటమిలో బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన లేవంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాధవ్ ఎదుటే...
మరొకవైపు కూటమి అంటే కులాలు ఉండకూడదని, అందరినీ కలుపుకుని వెళితేనే రాజకీయంగా లాభం చేకూరుతుందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. అన్ని కులాలను కలుపుకుని వెళ్లకుండా కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతల పెత్తనం ఎక్కడ? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు వైసీపీ కూడా విమర్శలు చేసిన ఆదినారాయణరెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలోనే ఈ కుల వ్యాఖ్యలు చేయడంతో కొంత ఇబ్బందిగా మారిందంటున్నారు. ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే. ఆయనకు నేటికీ టీడీపీ అగ్రనేతలతో సత్సంబంధాలున్నాయి. అలాంటి ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏదో బలమైన కారణముండి ఉంటుందన్న కామెంట్స్ మూడు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.
Next Story

