Thu Jan 08 2026 10:05:55 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నాయుడు గారిని తప్పిస్తారటగా.. ఆ స్థానంలో మరొక కీలకనేతకు బాధ్యత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడును కేబినెట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ మేరకు పార్టీ వర్గాల్లో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అయితే అదే సమయంలో అచ్చెన్నాయుడుకు కీలకమైన పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.అదీ పార్టీ పరంగా పదవి ఇచ్చేందుకు సిద్ధమయినట్లు తెలిసింది. అచ్చెన్నాయుడును రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేయాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది.
దశాబ్దాల నుంచి టీడీపీలోనే...
అచ్చెన్నాయుడు సీనియర్ నేత. కొన్ని దశాబ్దాల నుంచి కింజారపు కుటుంబానికి టీడీపీతో అనుబంధం ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, లేనప్పటికీ ఆ కుటుంబం వేరే పార్టీ వైపు చూడలేదు. శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కాకుండా ఉత్తరాంధ్రలోనూ టీడీపీకి మంచి పట్టున్న ఫ్యామిలీగా కింజారపు కుటుంబానికి పేరుంది. ఇప్పటికీ కేంద్రమంత్రివర్గంలో ఉన్న రామ్మోహన్ నాయుడుపై చంద్రబాబుకు కాని, లోకేశ్ కు కాని సదాభిప్రాయం ఉంది. ముఖ్యంగా లోకేశ్ కు రామ్మోహన్ నాయుడు సన్నిహితుడు కావడంతో పాటు ఎర్రన్నాయుడు కుమారుడిగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. రామ్మోహన్ నాయుడు ఎప్పుడూ జిల్లా రాజకీయాల్లో కానీ, ఇతర విషయాల్లోనూ జోక్యం చేసుకోరన్న పేరుంది.
అధ్యక్ష పదవి ఇచ్చి...
కానీ అచ్చెన్నాయుడు మాత్రం ఈ దఫా అనేక నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివాదాలు కూడా చంద్రబాబుకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయంటున్నారు. ఆప్కాఫ్ ఛైర్మన్ పదవి విషయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల మధ్య వివాదం కూడా ఈ నిర్ణయానికి కారణమంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేస్తే సామాజికవర్గం పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని, ప్రస్తుత అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. దానివల్ల అచ్చెన్నాయుడుకు కీలకమైన పదవి ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారంటున్నారు. అదే సమయంలో భారీగా మంత్రివర్గంలో మార్పులు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ఎవరు ఇన్ ? ఎవరు అవుట్ ? అన్నది ఇంకా క్లారిటీ రాకపోయినా విస్తరణలో మాత్రం అచ్చెన్నను కేబినెట్ నుంచి తొలగించి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మరి చంద్రబాబు నాయుడు నిర్ణయంపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.
Next Story

