పక్షిని కనిపెట్టడానికి 50 కోట్లు ఖర్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతరించిపోతున్న ఓ పక్షి జాడ కనిపెట్టడానికి 50 కోట్లు ఖర్చు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతరించిపోతున్న ఓ పక్షి జాడ కనిపెట్టడానికి 50 కోట్లు ఖర్చు చేశారు. అత్యంత అరుదైన కలివికోడి పక్షిని వైఎస్సార్ కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో ఇటీవల గుర్తించారు. ఈ పక్షిని, పక్షి పరిశోధక బృందం జులై, ఆగస్టు నెలల్లో వారాల తరబడి పరిశోధనలు చేసి కనిపెట్టారు. దీని కూతను కూడా రికార్డు చేశారు. ఈ కలివికోడి పక్షిని మొదట 1848లో పెన్నా నది దగ్గర చూశారు. ఆ తర్వాత చాలా కాలం కనిపించలేదు. 1985 జనవరి 5న రెడ్డిపల్లెకు చెందిన చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకుని అటవీ అధికారులకు ఇచ్చారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఈ జాతి అంతరించిపోయిందని చెప్పారు. 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వీయూ పరిశోధకుల బృందం అన్వేషణ సాగించింది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని లంకమలలో 2002లో ముంబయి నేచురల్ హిస్టరీ సొసైటీ ఈ పక్షి పాదముద్ర, కూతను రికార్డు చేసింది. వైఎస్సార్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో ప్రభుత్వం మూడు వేల ఎకరాల్లో శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటుచేసింది. 27 సెంటీమీటర్ల పొడవుండే ఈ పక్షి కూస్తే దాదాపు 200 మీటర్ల దూరం వినిపిస్తుంది. ఎగరలేని కారణంగా ఎత్తైన ముళ్లపొదల్లో నివాసం ఉంటూ గులక రాళ్లను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడతాయి.

