నా కుమారుడు నిర్దోషి : పుట్టా సుధాకర్ యాదవ్
తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.

తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మైదుకూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. అనూహ్యంగా తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల తాలూకు తీవ్ర దిగ్బ్రాంతి నుంచి తన కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. తన కుమారుడు నూరు శాతం తప్పు చేయలేదన్న సుధాకర్ యాదవ్, డ్రగ్స్ సహా ఎటువంటి దురలవాట్లు తన కుమారుడికి లేవని స్పష్టం చేశారు. ఒక డిన్నర్ పార్టీకి వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లిన తన కుమారుడు అక్కడి పరిస్థితి గమనించి బయటకు వచ్చేసే లోపే ఈగల్ టీమ్ పోలీసులు వచ్చి డ్రగ్స్ చెకింగ్ చేయాలని చెప్పి పోలీసుల సమక్షంలోనే యూరిన్ శాంపిల్ తీసుకున్నారని, 10 నిమిషాల తర్వాత పుట్టా మహేష్ కుమార్ కి నెగెటివ్ వచ్చిందని ఐదుగురికి మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పడం ప్రజలంతా చూసారన్నారు. కొద్దిసేపటి తర్వాత మరోసారి శాంపిల్ తీసుకోవాలని చెబుతూ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ యూరిన్ శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారన్నారు.

