Wed Jan 28 2026 13:35:59 GMT+0000 (Coordinated Universal Time)
పిఠాపురం రైల్వే స్టేషన్ కు మహర్దశ
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించిన పవన్ కల్యాణ్ పిఠాపురంలో రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. రైల్ ఓవర్ బ్రిడ్జి లేని కారణంగా అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్నారని పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రికి తెలిపారు. మరొకవైపు పిఠాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయాలని వినతి పత్రాన్ని అందచేశారు. కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వే అనుసంధానం పెంచాలని కోరిన పవన్ కల్యాణ్ దీనివల్ల పిఠాపురం నియోజకవర్గం కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల గురించి కూడా చర్చించారు.
పిఠాపురం రైల్వే స్టేషన్ ను...
సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన క్షేత్రం పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి పవన్ కళ్యాణ్ చర్చించారు. అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించినందుకుపవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

