Sat Dec 13 2025 22:32:56 GMT+0000 (Coordinated Universal Time)
Nimmakayala China Rajappa : నిమ్మకాయల వేరే ఆలోచనలో పడినట్లుందిగా?
టీడీపీలో సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది

టీడీపీలో సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆయనకు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందన్న అంచనాల్లో నిమ్మకాయల అనుచరులున్నారు. దశాబ్దకాలం నుంచి టీడీపీనే నమ్ముకుని ఉన్న నిమ్మకాయల చినరాజప్ప 2014 ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. అప్పట్లో హోంమంత్రి బాధ్యతను చేపట్టారు. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా లభించింది. చంద్రబాబుకు, లోకేశ్ కు అత్యంత సన్నిహితుడైన, నమ్మకమైన నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయనకు ఈసారి మంత్రిపదవి దక్కలేదు.
కూటమి ప్రభుత్వంలో...
కేవలం సామాజిక వర్గాల సమతూకంలో భాగంగానే నిమ్మకాయల చినరాజప్పకు మంత్రిపదవి దక్కలేదు. అయితే వచ్చే ఏడాదిలో మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా నిమ్మకాయల చినరాజప్పకు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కాపు సామాజికవర్గం మంత్రుల్లో నుంచి తప్పించిన వారి స్థానంలో రాజప్పకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కావడం ఒకింత మంత్రిపదవికి ఇబ్బందికరంగా మారుతుందంటున్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. జనసేనకు చెందిన ఇద్దరు మంత్రులు ఉండటంతో మరో కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఎలా అప్పగిస్తారన్న ప్రశ్న కూడా కలుగుతుంది.
వచ్చే ఎన్నికల నాటికి...
కానీ పెద్దాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప మాత్రం ఆశలు వదులుకోకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలో తానే పార్టీలో సీనియర్ కావడంతో పాటు పార్టీని నమ్ముకుని ఉండటం కూడా తనకు కలసి వస్తుందని నమ్ముతున్నారు. కానీ సామాజికవర్గం కోణంలో చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు చాలా తక్కువేనని అంటున్నారు. ఈ టర్మ్ లో మంత్రి పదవి రాకపోతే వచ్చే ఎన్నికలకు తాను శాసనసభకు పోటీ చేయకుండా పార్టీ నామినేటెడ్ పదవి అంటే రాజ్యసభకు వెళ్లాలన్న యోచనలో కూడానిమ్మకాయల చినరాజప్ప ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద ఒక ప్రయత్నం చేస్తే పోయేదేముంది అన్న రీతిలో ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారట.
Next Story

