Sat Dec 06 2025 08:07:41 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : నేడు కూడా వానలు..అలెర్ట్ గా ఉండాల్సిందే
దిత్వా తుపాను ప్రభావంతో నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో నేడు కూడా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో వానలు పడతాయని తెలిపింది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. ప్రధానంగా తమిళనాడును దిత్వా తుపాను ముంచెత్తింది. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తమిళనాడులో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లోనూ దిత్వా తుపాను ప్రభావం కనిపించింది. అయితే ఈ ప్రభావం నేడు కూడా ఉంటుందని, ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలో ప్రభావం...
ఆంద్రప్రదేశ్ లో ఎక్కువగా నెల్లూరు జిల్లాపై దిత్వా తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. గత నాలుగు రోజుల నుంచి కుండపోత వానలు పడుతున్నాయి. తిరుపతి జిల్లాలోనూ భారీ వర్షాలు రెండు రోజులుగా కురుస్తున్నాయి. ఇక ప్రకాశం, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి,అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు జిల్లాలో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానతో నెల్లూరు నగరంలోని అనేక చోట్ల వరద నీరు చేరింది. సబ్ వేలు కూడా మునిగిపోయాయి. వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ప్రమాదకరమని తెలిపింది.
చలి మాత్రమే...
దిత్వా తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పెద్దగా చూపలేదు. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు కురిశాయి. అంతే తప్పించి ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు. మరొకవైపు చలిగాలుల తీవ్రత మాత్రం తుపాను కారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.చలిగాలుల తీవ్రతతో పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉండటంతో ఉదయం, రాత్రి వేళల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అలాగే వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని, ఆస్మా రోగులు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story

