Wed Dec 10 2025 05:42:49 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : దివ్యాంగులకు త్వరలోనే గుడ్ న్యూస్... ఉచిత ప్రయాణంపై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించనుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం ఏపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి మహిళల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. దివ్యాంగులకు సైతం ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఉచిత ప్రయాణం కల్పించే సర్వీసులను ఖరారు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో జారీ కానున్నాయి. ఈ నిర్ణయం అమలు ద్వారా దాదాపు రెండు లక్షల మందికి పైగా దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది. వారికి ప్రత్యేక సీట్లను కూడా ఆర్టీసీలో కేటాయించనున్నారు.
ఇప్పటికే యాభై శాతం రాయితీ...
దివ్యాంగులకు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి టికెట్ ధరలో 50 శాతం రాయితీ లభిస్తుంది. ఈ నిర్ణయం అమలు పైన ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంత మంది టికెట్ రాయితీ పొందుతున్నారు.. ప్రభుత్వం పైన ఏ మేరకు భారం పడుతుందనేది లెక్కలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు. ఆర్టీసీ దాదాపు ప్రతీ ఏటా రూ 188 కోట్ల మేర దివ్యాంగులకు పాస్ ల రూపంలో రాయితీ భరిస్తోంది. వీరిలో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటారు. వీరికి ఇప్పటికే ఉచిత బస్సు పథకం ఉండటంతోపురుషులకు కొత్తగా అవకాశం కల్పించాల్సి ఉండటంతో ఎంత భారం పడుతుందన్న దానిపై అధికారులు లెక్కలు వేసి ప్రభుత్వానికి అందించనున్నారు.
ఉచిత బస్సు ప్రయాణానికి...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 7.68 లక్షల మంది వికలాంగ ఫించన్లు పొందుతున్నారు. మరో 24 వేల మంది పూర్తిగా మంచానికి పరమితమై ఫించన్లు తీసుకుంటున్నారు. దాదాపుగా రెండు లక్షల మంది ఆర్టీసీ రాయితీ వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత బస్సు అమలు చేస్తే దీనిని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వీరికి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించనున్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీరికి అమలు అవుతోంది. భవిష్యత్ లో ఈ కేటగిరీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. త్వరలోనే ఈ మేరకు అధికారికంగా మార్గదర్శకాలు అమలు కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆర్టీసీ, సంక్షేమ శాఖ అధికారుల సంయుక్తంగా కసరత్తు చేస్తున్నారు.
Next Story

