Fri Dec 05 2025 16:24:05 GMT+0000 (Coordinated Universal Time)
Liquor Case : ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఎన్ని మలుపులో?
ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

కల్తీ మద్యం కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన జనార్థన్ రావు విడుదల చేసిన వీడియో పై వైసీపీ సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనార్థన్ రావు చేత తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించారంటూ వైసీపీ నేతలు నేరుగానే విమర్శలు చేస్తున్నారు. కల్తీ మద్యం కేసును వైసీపీ మెడకు చుట్టాలన్న ప్రయత్నంలో చేసిన హడావిడిలో అసలు విషయాలను మర్చిపోయి వ్యవహరించారన్నది వైసీపీ నేతలు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. జనార్థన్ రావు వీడియోలో తనకు మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే తాను కల్తీమద్యం ప్లాంట్ ను ములకలచెరువులో పెట్టానని అన్నారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు.
విదేశాల్లో ఉన్న సమయంలో...
అయితే జనార్థన్ రావు ఆఫ్రికాలో ఉన్న సమయంలో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కూడా కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలకు సంబంధం లేదని చెప్పి సంకేతాలిచ్చారని, ఆ తర్వాతనే జనార్థన్ రావును విదేశాల నుంచి రావాలని చెప్పడంతో ఆయన వచ్చాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి జోగి రమేష్ కు అత్యంత సన్నిహిత మిత్రుడైతే జనార్థన్ రావు విదేశాల నుంచి రాకూడదని, కానీ తానే వచ్చి .. అంతే కాకుండా తాను వస్తున్న సమాచారాన్ని కూడా ఎక్సైజ్ పోలీసులకు ఇచ్చి గన్నవరం ఎయిర్ పోర్టులో అరెస్ట్ కావడం వెనక పెద్ద కుట్ర జరిగిందన్నది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. కల్తీ మద్యం కేసులో జనార్థన్ రావును పక్కనపెడితే అదే కేసులో ఉన్న జయచంద్రారెడ్డితో పాటు మరికొందరు నేతలు టీడీపీకి చెందిన వారేనని వైసీపీ నేతలు అంటున్నారు.
సీబీఐకి ఇవ్వాలంటూ...
వైసీపీ నేతలు సీబీఐ విచారణ కోరటం వెనక కొన్నేళ్ల పాటు కేసు విచారణలో తాత్సారం చేయడానికేనని చంద్రబాబు ప్రకటించిన గంటల్లోనే జనార్థన్ రావు వీడియో విడుదల కావడం కూడా తమకు అనుమానంగా ఉందని అంటున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పై తమకు నమ్మకంలేదంటున్న వైసీపీ నేతలు ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం విచారణ పారదర్శకంగానే సాగుతుందని ఇందులో ఎలాంటి వివక్ష ఉండదని, రాజకీయ కుట్ర బయటపడుతుందన్న కారణంతోనే వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద ములకల చెరువు కల్లీ మద్యం కేసులో ఎప్పుడు ఏ రకమైన ట్విస్ట్ చోటు చేసుకుంటుందన్నది మాత్రం ఆసక్తికరంగానే మారింది.
Next Story

