World Cup 2023 : ఈ మ్యాచ్ గెలిస్తేనే .. లేకుంటే దాదాపుగా అంతే

పాకిస్థాన్ నేడు కీలక మ్యాచ్ జరగబోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ కు వెళ్లడానికి సాధ్యమవుతుంది

Update: 2023-10-27 04:07 GMT

వరల్డ్ కప్‌లో ఈసారి సంచలనాలు జరుగుతున్నాయి. చిన్న జట్లు విజయం సాధిస్తున్నాయి. పెద్ద జట్లు చతికలపడుతున్నాయి. బలమైన జట్లు అని జబ్బలు చరుకున్నా మైదానంలో మాత్రం తలదించుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పరిస్థితి అలాగే ఉంది. అదే సమయంలో పాకిస్థాన్ జట్టు కూడా అంతే స్థాయిలో ఆడుతుంది. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా విఫలమవుతుండటంతో పాకిస్థాన్ జట్టు అసలు సెమీస్ కు చేరుతుందా? లేదా? అన్నది కూడా సందిగ్దంగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలో పాకిస్థాన్ దక్షిణాఫ్రికా జట్టుతో ఆడనుంది.

ఆత్మవిశ్వాసం దెబ్బతిని...
పాకిస్థాన్ ఇప్పటికే ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓటమి పాలయి పరాభవం నుంచి తేరుకోలేదు. అయితే ఈరోజు జరిగే డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే. లేకుంటే సెమీ ఫైనల్స్ కు చేరుకోవడం కష్టమే. ఇంగ్లండ్ జట్టుకు పట్టిన గతే పాక్ జట్టుకు కూడా పట్టనుంది. అయితే పాకిస్థాన్ ఈరోజు ఎదుర్కొంటున్న జట్టు ఆషామాషీ జట్టు కాదు. సెమీ ఫైనల్స్ వైపునకు వరస విజయాలతో దూసుకెళుతున్న దక్షిణాఫ్రికా జట్టుతో. అందుకనే ఈ భయమంతా. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలయితే సెమీస్ ఆశలు గల్లంతయినట్లే.
అన్ని విధాలుగా...
ఇక దక్షిణాఫ్రికా జట్టు ఫుల్లు ఫాంలో ఉంది. కేవలం ఒక మ్యాచ్‌లోనే అది ఓటమి పాలయింది. నెదర్లాండ్స్ లో ఓటమి పాలయి నవ్వులపాలయినా అది వర్షం కురియడంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి వల్లనేనని సర్ది చెప్పుకుంది. తర్వాత రెచ్చిపోతుంది. బ్యాటర్లు అందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సఫారీల సక్సెస్ రేటు చూస్తే పాకిస్థాన్ కు ఈ మ్యాచ్ లో గెలవడం అంత సులువు కాదు. పాక్ ఆటగాళ్లలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. బౌలర్లలోనూ పెద్దగా పస లేదు. ఒక్క ఆఫ్రిదీని మించి ఎవరూ అనుకున్నట్లుగా రాణించడం లేదు. బ్యాటర్లలోనూ అంతే. కెప్టెన్ బాబర్ ఆజమ్ తప్పించి మిగిలిన బ్యాటర్లంతా ఎప్పుడు వస్తారో? ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికతో మ్యాచ్ తో నైనా దాయాది జట్టు నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది క్రికెట్ ఫ్యాన్స్ ను రేపుతున్న ఉత్కంఠ. మరి ఏం జరుగుుతందనేది చూడాలి.


Tags:    

Similar News