Wolrd Cup Finals 2023 : వణుకు పుడుతుంది... గణాంకాలు చూస్తేనే.. కానీ కంగారు పడొద్దట

వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ కు మరికొద్ది గంటల సమయమే మిగిలి ఉంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఈరోజు ఫైనల్స్ జరగనుంది

Update: 2023-11-19 05:45 GMT

వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ కు మరికొద్ది గంటల సమయమే మిగిలి ఉంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఈరోజు ఫైనల్స్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ అంతా చేరుకున్నారు. నేటి మ్యాచ్ అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ ఐదు సార్లు ఆస్ట్రేలియా టీం ఇండియా చేతిలో ఓడిపోగా, ఎనిమిది సార్లు భారత్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయింది. ఈరోజు మ్యాచ్ లో బంతి బంతికి లెక్కేసుకుంటూ ఫ్యాన్స్ గడపనున్నారు. పరుగు.. పరుగును కూడుకుంటూ కలలు కననున్నారు.

లెక్కల పరంగా చూస్తే...
వరల్డ్ కప్ ను భారత్ రెండు సార్లు సొంతం చేసుకుంటే.. ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ ఐదుసార్లు గెలుచుకుంది. ఎటు చూసినా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాదే పైచేయిగా కనిపిస్తుంది. 2011 లో టీం ఇండియా వన్డే వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కప్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. 1983 తర్వాత 2011లో టీం ఇండియా కప్ ను చేజిక్కించుకుంది. అంటే ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత కాని భారత్ కల సాకారం కాలేదు. 2011లో గెలుచుకున్న టీం ఇండియా 2023లో గెలుస్తుందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈసారి కప్పు మనదేనని అధిక శాతం మంది క్రీడా పండితులు చెబుతుండటం విశేషం. ఎందుకంటే టీం ఇండియా ప్రస్తుతం ఉన్న ఫామ్ అలాంటిది.
మొగ్గు మనవైపే...
టీం ఇండియా సొంత మైదానంలో ఆడుతుండటంతో కొంత మనవైపే విజయం మొగ్గు చూపుతుందన్న అంచనాలు ఎక్కువగా వినపడుతున్నాయి. లీగ్ మ్యాచ్‌లలో పది మ్యాచ్‌లలో ఓటమి ఎరుగ కుండా ఫైనల్స్ లోకి దూసుకు వచ్చిన టీం ఇండియా అహ్మదాబాద్ లోనూ సత్తా చాటే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని ఫార్మాట్లలో భారత్ టీం బలంగా ఉండటమే అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లు బంతితో ఆటాడుకుంటున్నారు. బ్యాటర్ల విష‍యం చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ఇంగ్లండ్ పైనే తక్కువ స్కోరు ఈ వరల్డ్ కప్ లో చేయగలిగింది. మిగిలిన అన్ని మ్యాచ్‌లలో మంచి స్కోరు సాధించి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది.
వత్తిడి కూడా ఎక్కువే...
అలాగే టీం ఇండియాపై వత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ఆస్ట్రేలియా టీంను తక్కువగా అంచనా వేయలేని పరిస్థిితి. సెమీ ఫైనల్స్ లో సౌతాఫ్రికాపై అది చచ్చీ చెడీ గెలిచినా ఒక్కోసారి పుంజుకుంటే దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన జట్టుతో గేమ్ అంటే ఆషామాషీ కాదు. అయినా సరే మన బౌలర్లు చేయి తిరిగితే.. ఆసిస్.. అయినా ఇంకొకరయినా మట్టికరవక తప్పదు. అదే మన ఆశ. ఆశ కాదు జరగాలన్న గట్టి ఆకాంక్ష. దాదాపు రెండు నెలల నుంచి ఇండియాను పట్టి పీడిస్తున్న క్రికెట్ ఫీవర్ కు రేపు టీం ఇండియా జట్టు ఎలాంటి మందు ఇస్తుందో వేచి చూడాలి. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.


Tags:    

Similar News