World Cup Semi Finals 2023 : ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియాకు ఢోకా లేదంతే

మన దేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టీం ఇండియాకు కలసి వచ్చినట్లే కనిపించింది.

Update: 2023-11-15 13:18 GMT

మన దేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టీం ఇండియాకు కలసి వచ్చినట్లే కనిపించింది. బ్యాటర్ల ఆటతీరు మెరుగుపడటమే కాకుండా కొన్ని స్థానాలకు సరైనోళ్లు దొరికారు. భవిష్యత్ లో మనకు ఢోకా లేదని పించేలా మనోళ్లు ఆటాడుకుంటున్నారు. బ్యాటింగ్ పరంగా మన బలం.. బలగాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఈ వేదికలను చక్కగా వినియోగించుకున్నారు. మాతో పెట్టుకోవద్దన్నట్లు... ఒకరు కాకుంటే...మరొకరు... అంటూ బంతిని బాదుతూ నరాలను మెలిపెట్టేస్తున్నారు. స్టేడియాలను కుదిపేస్తున్నారు.

ఓపెనర్ గా....
ఓపెనర్ గా శుభమన్ గిల్ దున్నేస్తున్నాడు. శుభమన్ గిల్ ఈ వరల్డ్ కప్ లో పది మ్యాచ్ లు ఆడితే ఒకటి రెండు మ్యాచ్‌లు మినహాయించి అన్ని మ్యాచ్ లలో రాణించి ఇక టీం ఇండియాకు ఓపెనర్ల కొరత లేదనిపించేలా ఆటాడాడు. కీలకమైన సెమీ ఫైనల్స్ లోనూ శుభమన్ గిల్ ఆడిన తీరును అందరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రోహిత్ శర్మతో కలసి మైదానంలోకి అడుగుపెట్టి సొగసైన షాట్లతో ప్రత్యర్థి ఎవరైనా రిస్కీ షాట్లు కొట్టి మరీ రన్ రేటును పెంచుతున్న శుభమన్ గిల్ టీం ఇండియాకు దొరికిన వజ్రమనే చెప్పాలి. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ ఎనభై పరుగులు చేశాడు.
తిరుగులేదని...
మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా అదే దూకుడుతో ఆడుతున్నారు. సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. అయ్యర్ కూడా ఈ వరల్డ్ కప్ లో ఫుల్లు సక్సెస్ అయి, ఫోర్త్ డౌన్ లో భారత్ కు ఇక లోటు లేదని చాటి చెప్పాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన అయ్యర్, ఈ మ్యాచ్ లోనూ శతకం పూర్తి చేసుకున్నాడు. పూర్తి కాన్ఫిడెన్స్ తో కొడుతున్న షాట్లను చూసి సీనియర్ ఆటగాళ్లే ఆశ్చర్యపోతున్నారు. అలా టీం ఇండియాకు వరల్డ్ కప్ ద్వారా సరైనోళ్లు దొరికారని చెప్పాలి. వీరు వయసులోనూ చిన్నోళ్లు కావడంతో జట్టులో దీర్ఘకాలం నిలదొక్కుకునే అవకాశాలున్నాయి. టీం ఇండియాకు ఇక ముందుంది మంచికాలమే...


Tags:    

Similar News