World Cup 2023 : శభాష్.. ఇదీ కదా ఆటంటే.. వీళ్లు కదా ఆటగాళ్లంటే

వరల్డ్ కప్ లో ఆప్ఘనిస్థాన్ ముఖచిత్రాన్నే మార్చేశారు. పెద్ద పెద్ద జట్లు అన్న వాటిని సులువుగా ఓడించారు

Update: 2023-10-31 02:47 GMT

పసి కూనలు ఇక అనడం కరెక్ట్ కాదేమో. వరల్డ్ కప్ లో ఆప్ఘనిస్థాన్ ముఖచిత్రాన్నే మార్చేశారు. పెద్ద పెద్ద జట్లు అన్న వాటిని సులువుగా ఓడించారు. మొన్న ఇంగ్లండ్, నిన్న పాకిస్థాన్ తాజాగా శ్రీలంక జట్లను ఓడించి శభాష్ అని అనిపించుకున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ నివ్వెర పోయేలా చేశారు. సంచలన విజయాలను వరసగా నమోదు చేస్తూ ఈ వరల్డ్ కప్ లో ఆప్ఫనిస్థాన్ అద్భుతాలను సృష్టిస్తుంది. ఏమో గుర్రం ఎగరా వచ్చు అన్న రీతిలో ఆప్ఫనిస్థాన్ సెమీస్ లోకి ఎంటర్ అయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

మూడు పెద్ద టీంలను...
వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచ్ లలో ఆప్ఫనిస్థాన్ మూడు గెలిచి మూడింట ఓటమి పాలయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో వీరి తర్వాత స్థానాల్లో శ్రీలంక, పాకిస్థాన్ నిలిచాయి. పెద్ద పెద్ద జట్లు అంటే ఏమాత్రం బెరుకు లేకుండా మైదానంలో ఆప్ఘాన్లు చూపిన ప్రతిభను ఎవరూ కాదనలేం. వారి ఆటతీరుకు అందరం సెల్యూట్ చేయాల్సిందే. మూడు ప్రధానమైన జట్లను ఓడించి సెమీస్ కు చేరువలోకి వచ్చిందంటే ఆ జట్టు సమిష్టి కృషి ఆషామాషీ కాదు.
శ్రీలంకపై విజయం....
నిన్న శ్రీలంకతో ఆప్ఫనిస్థాన్ జట్టు ఆడిన తీరును చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇటు బ్యాటింగ్ పరంగా, అటు బౌలింగ్ పరంగా సమర్థంగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టారు. శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులు చేస్తే ఛేదనలో 45.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హష్మతుల్లా 58 పరుగులు, రహ్మత్ షా 62 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఆప్ఘనిస్థాన్ అంటే అన్ని జట్టుకు భయం పట్టుకునేలా చేసింది. రానున్న కాలంలో ఆప్ఫనిస్థాన్ మరెన్ని సంచలనాలను సృష్టిస్తుందన్నది చూడాలి.


Tags:    

Similar News