ఒకరోజు రెండు వేల రూమ్.. ఇరవై వేల రూపాయలట

రేపటి భారత్ - పాక్ మ్యాచ్‌కు ఇప్పటికే స్టేడియంలో టిక్కెట్లన్నీ బుక్కయ్యాయి. హోటల్ రూమ్‌లన్నీ నిండిపోయాయి

Update: 2023-10-13 04:52 GMT

రేపు మామూలుగా ఉండదు. ప్రతి బంతికీ అరుపులు.. కేకలు. రెండు వైపుల వీర ఫ్యాన్స్. ఎంతగా అంటే స్టేడియంలోనే కొట్టుకునేంతగా. అంత హైఓల్టేజీ మ్యాచ్ రేపు జరగబోతుంది. భారత్ - పాకిస్థాన్‌ల మధ్య రేపు వన్డే మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ లో భాగంగా పాక్‌తో తొలి మ్యాచ్ భారత్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు బలంగా ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఎవరినీ ఏ మాత్రం తీసిపారేయలేని పరిస్థితి. అందుకే రోమాలు నిక్క బొడుచుకుంటాయి. ప్రతి బంతి ముఖ్యమే. ప్రతి పరుగూ అవసరమే. అదే రేపు దాదాపు ఏడు గంటల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనుంది.

ఇరు దేశాల ఫ్యాన్స్...
రేపటి భారత్ - పాక్ మ్యాచ్‌కు ఇప్పటికే స్టేడియంలో టిక్కెట్లన్నీ బుక్కయ్యాయి. అహ్మదాబాద్‌లోని స్టేడియి పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోతుంది. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్ లో నిన్నటి నుంచే లాడ్జిలన్నీ ముందుగానే బుక్ అయ్యాయి. భారత్ - పాక్ మ్యాచ్ ఉండటంతో హోటళ్ల నిర్వాహకులు రూమ్‌ల అద్దెలు విపరీతంగా పెంచారు. రెండు వేలు ఒకరోజుకు తీసుకునే రూమ్ ఇరవై వేలకు పెంచారంటే అతిశయోక్తి లేదు. అయినా హోటళ్లలో రూమ్‌లన్నీ బుక్ అయ్యాయి.
భోజనం ధరలు...
వేల సంఖ్యలో ఇరు దేశాలకు చెందిన అభిమానులు రావడంతో అహ్మదాబాద్ ఇప్పటికే కిటికటలాడిపోతుంది. పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుమానితులను తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక సాధారణ హోటల్‌లో భోజన రేట్లను కూడా నిర్వాహకులు విపరీతంగా పెంచేశారు. క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో భోజనం ధరను నాలుగు రెట్లు పెంచారు. అయినా సరే అనేక మంది నిన్నటి నుంచే అహ్మదాబాద్ చేరుకోవడంతో భోజనానికి ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ కడుపులు నింపుకుంటున్నారు.
ప్రయాణపు ఛార్జీలు...
ఇక లాడ్జి గదుల నుంచి స్టేడియానికి చేరుకోవడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కూడా తడిసిమోపెడవుతున్నాయి. స్టేడియానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రయివేటు వాహనాలను నిలిపేస్తామని పోలీసులు తెలిపారు. అయినా సరే క్యాబ్‌లు, ఆటోలు విపరీతంగా తమ రేట్లను పెంచేస్తున్నారు. ఇప్టటికే అహ్మదాబాద్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తుండటంతో వారిని చూసేందుకు ఇరు జట్ల అభిమానులు స్టేడియానికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం స్టేడియంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. రేపు ఉదయం పది గంటల నుంచి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని చెబుతున్నారు.


Tags:    

Similar News