Women's Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు మొదలైంది ? ఎందుకు జరుపుకుంటాం ?

మహిళా దినోత్సవానికి 1908లోనే బీజాలు పడ్డాయి. మహిళలకు తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం..

Update: 2023-02-28 12:13 GMT

international women's day, united nations, #EmbraceEquity

అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతిఏడాది మార్చి 8వ తేదీన జరుపుకుంటాం. ఈ రోజున మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తారు. ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలను ప్రత్యేకంగా సన్మానిస్తారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంతా బాగానే ఉంది. అసలు మహిళా దినోత్సవం ఎప్పుడు మొదలైంది. ఎందుకు జరుపుకుంటాం అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


నెట్టింట్లో లభించిన సమాచారం ప్రకారం.. దాదాపు శతాబ్ద కాలానిపైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఒక కార్మిక ఉద్యమం నుంచి ఇది పుట్టుకొచ్చింది. ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించి ప్రతి ఏటా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మహిళా దినోత్సవానికి 1908లోనే బీజాలు పడ్డాయి. మహిళలకు తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. వారి డిమాండ్ల దృష్ట్యా అమెరికాలోని సోషలిస్టుపార్టీ 1909వ సంవత్సరంలో ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని క్లారా జెట్కిన్ అనే మహిళ ఆలోచించారు. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు.

తొలిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ఆ తర్వాత తొలిసారిగా 1911లో మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో 10 లక్షలకు పైగా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913 లో రష్యాలోనూ ఫిబ్రవరిలో వచ్చే చివరి ఆదివారం రోజున మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1914లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. బహుశా ఆ రోజు ఆదివారం అని ఆ ప్రకటన చేసి ఉంటారే తప్ప.. ఆ రోజునే మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మరే ఇతర కారణం లేదని తెలిసింది. ఆ తర్వాత వివిధ దేశాల్లోని మహిళలు ఎన్నో విప్లవాలు చేయడంతో.. మహిళలకు మార్చి 8న సెలవు ప్రకటించారు.

ఐరాస ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు
1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం (థీమ్)తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2011, మార్చి 8న ఐక్యరాజ్యసమితి మహిళా దినోత్సవం శతాబ్ది ఉత్సవాలను నిర్వహించింది. అమెరికాలో అప్పటి అధ్యక్షుడైన బరాక్ ఒబామా 2011 మార్చిని "మహిళల చారిత్రక మాసం"గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో 100 సంవత్సరాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 20 సెంట్ల నాణేన్ని విడుదల చేసింది ప్రభుత్వం.
2023లో జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 112వది. ఈ సారి ఐక్య రాజ్యసమితి #EmbraceEquity థీమ్ తో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారింది.


Tags:    

Similar News