ఏపీకి నేడు పెద్దఎత్తున చిన్న నోట్లు

Update: 2016-12-15 03:48 GMT

రిజర్వ్ బ్యాంక్ నుంచి గురువారం ఉదయం మరో రూ.500 కోట్ల విలువైన నోట్లు రాష్ట్రానికి రానున్నాయి. ఇందులో రూ.300 కోట్లు 500 నోట్లు కావడం విశేషం. ఇవి కేవలం పెన్షన్‌దారులకు మాత్రమే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్యాంక్ అధికారులు, జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో రూ.1058 కోట్ల నగదు అందుబాటులో వుండగా, అందులో రూ.340 కోట్లు చిన్న నోట్లు వున్నాయని, ఇవి గ్రామీణ ప్రాంతాలకు తక్షణం పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘నేను అనుకున్నంత వేగంగా బ్యాంకర్లు కలిసిరావడం లేదు. బ్యాంకర్లకు ఇబ్బంది లేకపోయినా ఈ విషయంలో ఇబ్బంది ప్రభుత్వానికే’ అని ముఖ్యమంత్రి బుధవారం రాత్రి జరిగిన డిమానిటైజేషన్ సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించారు. బ్యాంకర్లు ఈ సంక్షోభ సమయంలో వ్యాపార ధోరణితో కాకుండా ప్రజా సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించడంలోనూ, నగదు సత్వర పంపిణీలోనూ బ్యాంకర్ల ఉదాశీనత వల్ల చాలా నష్టం జరుగుతోందని అన్నారు. ఈ వైఖరిని బ్యాంకర్లు తక్షణం వీడనాడాలని అన్నారు. ఏటీఎం, బ్యాంకు క్యూలైన్లలో కొంతమంది చనిపోతున్నట్టు వార్తలు రావడం అత్యంత బాధాకరమని, ఇకముందు అలాంటి వార్తలు వినిపించరాదని చెప్పారు. ఇప్పటినుంచే దీనికి తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరారు.

జన్‌ధన్ అకౌంట్లు, రూపే కార్డులు, ఇతర ఖాతాలు ఎన్ని చలామణిలో వున్నాయో వెంటనే వివరాలు సేకరించి రోజువారీ సమీక్షించుకోవడం ద్వారా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో 35 శాతం ఆన్‌లైన్, 25 శాతం మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్ధేశించారు. అదేవిధంగా వివిధ బ్యాంకులకు చెందిన 13 వేల వినియోగంలో లేని ఇ-పోస్ మిషన్లను తక్షణమే వెనక్కి తీసుకుని అవసరమైన వారికి అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే దీనికి పోలీస్ సహకారం తీసుకోవాలని చెప్పారు. వినియోగంలేని ఇ-పోస్ మిషన్లను తక్షణం వినియోగంలోకి తీసుకొచ్చే బాధ్యత బ్యాంకర్లదేనని అన్నారు.

Similar News