సుష్మాకు కానుకగా కిడ్నీల వెల్లువ

Update: 2016-11-20 05:50 GMT

సుష్మా స్వరాజ్ పార్టీలతో నిమిత్తం లేకుండా తనకంటూ ఈ దేశంలో అభిమానుల్ని కలిగిఉండే నాయకురాళ్లలో ఒకరు. అందుకే ఆమెకు ఇప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చిందని తెలిసినప్పుడు దేశంలో చాలా మంది అందు గురించి సానుభూతి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆమె ఆరోగ్య స్థితి పట్ల ఆందోళన చెందడం మాత్రమే కాదు. ఆమె కిడ్నీ మార్పిడి అవసరం అని తెలియగానే దేశవ్యాప్తంగా పలువురు అవసరమైతే తమ కిడ్నీ ఇస్తాం అంటూ ముందుకు వస్తుండడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం.

సుష్మా స్వరాజ్ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. విదేశాల్లో మన దేశానికి చెందిన వారు చిక్కుబడిపోయినప్పుడు, వివాదాల్లో చిక్కకున్నప్పుడు, అక్కడ దుర్మరణాల పాలైనప్పుడు కేంద్ర ప్రభుత్వం పరంగా చాలా వేగంగా చొరవ చూపించడం వారి కుటుంబాలకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవడంలో సుష్మా స్వరాజ్ తన చిత్తశుద్ధిని పలుమార్లు నిరూపించుకున్నారు.

ట్వీట్ ద్వారా సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లినా సరే.. చాలా వేగంగా, పాజిటివ్ గా స్పందించే నాయకురాలిగా కూడా సుష్మకు పేరుంది. ఆ మంచిపేరే ఇప్పుడు ఆమెకోసం జనం స్పందించేలా చేస్తోంది.

సుష్మకు కిడ్నీ మార్పిడి అవసరం అని తెలియగానే, ఆమె ఆ విషయాన్ని ట్విటర్ లోనే బయటపెట్టారు. అందులోనే చాలా మంది తమ కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ప్రతిస్పందించారు. నరసరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా తన కిడ్నీ తీసుకోవచ్చునంటూ ఆమెకు లేఖ రాశారు. కేవలం ట్వీట్లు మాత్రమే కాకుండా... సీరియస్ గా కూడా అవసరమైతే సుష్మా లాంటి మంచి నాయకురాలికి తమ కిడ్నీ ఇస్తాం అంటూ పలువురు ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఆమె సంపాదించుకున్న మంచి పేరు ఫలితమే అని పలువురు అంటున్నారు.

Similar News