విన్-విన్ : కేసీఆర్ ప్లాన్ గొప్ప ఫలితం ఇచ్చింది!

Update: 2016-11-14 13:30 GMT

‘‘నువ్వు లాభపడు- నేను లాభపడతా’’ అని సూచించే ‘విన్-విన్’ ప్రపోజల్ తరహాలో కేసీఆర్ సర్కారు భూములు, భవనాలు రెగ్యులరైజేషన్ చేసుకునే వారికి పాతనోట్లు రూపేణా పెనాల్టీ రుసుములు చెల్లించేందుకు కల్పించిన వెసులుబాటు.. అటు సర్కారుకు ఇబ్బడి ముబ్బడిగా ఒకేసారిగా లాభాలు తెచ్చిపెట్టడం మాత్రమే కాదు. ఇటు ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా మారింది. కేవలం రెండురోజుల వ్యవధిలోనే జీహెచ్ ఎంసీ కి రెగ్యులరైజేషన్ ల నగదు రూపేణా.. 50 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరడం విశేషం.

పెద్దనోట్లను, పాతనోట్లను మార్చుకోవడం అనేది జనానికి బ్రహ్మప్రళయం అవుతున్న వేళ.. భూముల రెగ్యులరైజేషన్ కు నోటీసులు అందుకున్న వారు వెంటనే చెల్లిస్తే పాతనోట్లు తీసుకుంటాం అంటూ కేసీఆర్ ఓ వెసులుబాటు కల్పించారు. సోమవారం రాత్రి వరకు పాతనోట్లను స్వీకరించడం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలామంది విషయంలో ఉభయతారకమైన నిర్ణయం కావడంతో ‘కేసీఆర్ నిర్ణయం భేష్’ అంటూ తెలుగుపోస్ట్ ఓ కథనాన్ని కూడా అందించింది.

అయితే కేసీఆర్ వ్యూహం మరింతగా గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. రెండు రోజుల్లోనే 50 కోట్లకు పైగా లాభం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పన్నుల రూపేణా లాభాలు అదిరాయ్..

రెగ్యులరైజేషన్ మొత్తాలు ఒక ఎత్తు అయితే.. పన్నుల చెల్లింపునకు కూడా కేసీఆర్ సర్కారు ఇదే వెసులుబాటు ఇవ్వడం కూడా జీహెచ్ఎంసీకి చాలా లాభించింది. ఈ మూడురోజుల్లో వారికి ఆస్తిపన్నుల రూపేణా 100 కోట్లు రూపాయల బకాయిలు చెల్లింపు అయ్యాయి. అలాగే నల్లా బిల్లుల బకాయిల రూపేణా 25 కోట్లరూపాయలు చెల్లింపులు అయ్యాయి.

Similar News