రేపు కొండకు రావద్దు ప్లీజ్.....

Update: 2017-01-02 14:26 GMT

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తిరుపతికి రానున్నారు. ఆయన తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకోనున్నారు. దీంతో టీటీడీ అన్ని చర్యలు చేపట్టింది. తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారు. ఇటు ప్రధాని పర్యటన...మరో వైపు తిరుమల ఆలయంలో జరిగే కోయిల్ ఆళ్వాల్ తిరుమంజన శుద్ధి కారక్రమంతో మంగళవారం తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడక తప్పదంటోంది టీటీడీ.

మోడీ....ధనుర్మాసం...

తిరుమల ఎప్పుడు చూసినా భక్తులతో కిటకిట లాడుతుంటుంది. ధనుర్మాసం కావడంతో లక్షల సంఖ్యలో నిత్యం భక్తులు వస్తుంటారు. శ్రీవారికి నిత్యం ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రత్యేక ప్రసాదాలు కూడా చేస్తారు. అదే ధనుర్మాసం విశిష్టత. అయితే మంగళవారం మాత్రం తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడక తప్పదు. కోయిల్ ఆళ్వాల్ తిరుమంజన శుద్ధి కార్యక్రమం జరుగుతున్నందున టీటీడీ మధ్యాహ్నం 12 గంటల వరకూ దర్శనాలను నిలిపేసింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన కూడా చేసింది. మధ్యాహ్నం తర్వాత ఆలయంలోకి సాధారణంగా భక్తులను అనుమతిస్తారు. కాని మంగళవారం తిరుపతికి చేరుకోనున్న ప్రధాని సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తిరుమలకు చేరుకుంటారు. ప్రధాని ప్రోగ్రాం ఇప్పటికే ఖరారయింది. దీంతో భద్రతా బలగాలు తిరుమలను మొత్తం తమ అధీనంలోకి తీసుకుంటాయి. ప్రధాని వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్లేంత వరకూ భక్తులను అనుమతించరు. ఇప్పటికే ప్రధాని పర్యటించే మార్గంలో అనేక ఆంక్షలు పెట్టాయి భద్రతా బలగాలు. దీంతో ఉదయం వెళ్లిన భక్తులు సాయంత్రం వరకూ క్యూలైన్లలోనే వేచి ఉండక తప్పదంటున్నాయి టీటీడీ వర్గాలు.

Similar News