మోదీ సన్నాహక భేటీ... యుద్ధభేరీ నినాదమేనా?

Update: 2016-11-08 14:25 GMT

సరిహద్దుల్లో పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొన్ని వారాలుగా సరిహద్దుల్లో దాదాపుగా అప్రకటిత యుద్ధమే నడుస్తోంది. సర్జికల్ దాడులు జరిగిన నాటినుంచి పాకిస్తాన్ దాదాపుగా ప్రతిరోజూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండడమూ.. భారత్ దళాలు దీటుగా జవాబివ్వడమూ అనేది నిత్యకృత్యమైపోయింది. ఇంచుమించుగా ఇదే యుద్ధ వాతావరణం. ఇలాంటి సంక్లిష్టమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నాడు త్రివిధ దళాధిపతులతో నిర్వహించిన సమావేశం చాలా కీలకమైనది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న వాస్తవ పరిస్థితులను మోదీ ఈ సమావేశంలో సమీక్షించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ సమీక్ష సమావేశమే.. దాదాపుగా పాకిస్తాన్ తో యుద్ధ సన్నాహక సమావేశం కూడా కావచ్చుననే సంకేతాలు కూడా పొడసూపుతున్నాయి.

త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ సమావేశంలో.. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి, పాకిస్తాన్ ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండడం గురించి ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ప్రధానికి వివరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అవసరమైతే పాకిస్తాన్ మీద ఏ క్షణంలోనైనా దాడులు చేయడానికి గల సన్నద్ధత గురించి కూడా ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమీక్షించినట్లుగా తెలుస్తోంది. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు త్రివిధ దళాల సన్నద్ధత గురించి మోదీ తెలుసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇదంతా కూడా యుద్ధ సంకేతాలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనంతగా మనం యుద్ధాన్ని ప్రారంభించే అలవాటు భారత్ కు లేకపోయినప్పటికీ.. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను చూస్తూ ఉపేక్షించడం కూడా జరగకపోవచ్చు. ఆ నేపథ్యంలో యుద్ధభేరీ నినాదం లాగానే.. ప్రధాని మోదీ సమావేశం కనిపిస్తున్నదని పలువురు భావిస్తున్నారు.

Similar News