‘భోగాపురం’తో శంషాబాద్ కు చెక్ పెట్టాలని...

Update: 2016-11-16 18:05 GMT

గతంలో హైదరాబాదు కేంద్రంగా రాజధానిగా పాలన సాగించిన వ్యక్తి.. ఇవాళ ఏమీలేని ఒక కొత్త రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్నప్పుడు, ఆ రాష్ట్రానికి ప్రతి చిన్న వసతిని కొత్తగా సమకూర్చడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు.. తాను గతంలో పాలించిన హైదరాబాదుతో పోల్చుకుంటూ అంతకంటె ఉత్తమంగా చేయాలని తపన పడడం సహజం. అమరావతి నగర నిర్మాణ ఆలోచనలను వింటే.. ఇలాంటి వాదన నిజం అనిపిస్తుంది. చివరికి విశాఖ సమీపంలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం వరకు చంద్రబాబు అదే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. భోగాపురం విమానాశ్రయంపై ఆయన పెడుతున్న శ్రద్ధ చూస్తే.. దాని నిర్మాణం ద్వారా హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టును సైతం తలదన్నాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీన్‌‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోని టాప్-10లో ఒకటిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో అనుభవమున్న విదేశీ-స్వదేశీ సంస్థల భాగస్వామ్యంతో దీనిని నిర్మించాలని సూచించారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. భోగాపురం విమానాశ్రయానికి వచ్చే నెల మొదటివారం కల్లా పర్యావరణ అనుమతులు పొందాలని, 2017 జనవరి నాటికి పబ్లిక్ హియరింగ్‌ను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

భోగాపురం విమానాశ్రయానికి 2,646 ఎకరాలకు గాను 2,172 ఎకరాల సేకరణ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఓర్వకల్లు, దొనకొండ, నాగార్జునసాగర్, దగదర్తి విమానాశ్రయాల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రంలోని విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 44% పురోగతి సాధించామని అన్నారు. అత్యధికంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 13,22,538 మంది ప్రయాణికులు రాకపోకలు జరిపినట్టు తెలిపారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల విస్తరణ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణలో భాగంగా 698 ఎకరాలకు గాను 610 ఎకరాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించామన్నారు.

తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు, విశాఖపట్నం విమానాశ్రయానికి దుబాయ్, లండన్, హాంగ్‌కాంగ్ నుంచి సర్వీసులు నడిచేలా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే విజయవాడ – ముంబై మధ్యన తక్షణం విమాన సర్వీసుల అవసరం వుందన్నారు.

మొత్తానిక స్పర్ధయా వర్ధతే విద్యా అన్నట్లుగా.. తెలుగురాష్ట్రాల మధ్య పోటీవాతావరణం అభివృద్ధికి బాటలు వేస్తోంది.

Similar News