బెంగాల్ పాఠాల్లో సింగూర్ సిలబస్

Update: 2017-02-14 12:00 GMT

దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా వర్సెస్ మమతా బెనర్జీ గుర్తుంది కదా..... టాటాల కలల ప్రాజెక్టు నానో కారు రూపకల్పన కోసం పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం చేసిన భూ కేటాయింపు దేశంలో పెద్ద వివాదమే సృష్టించింది. భూ కేటాయింపుల వ్యతిరేక ఉద్యమమే బెంగాల్లో కమ్యూనిస్టుల పాలనకు ముగింపు పలికి తృణమూల్‌ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది. ఆ ఉద్యమమే ఇప్పుడు సింగూర్ భూ ఉద్యమ పాఠ్యాంశంగా రానుంది. చరిత్ర సిలబస్‌లో దీన్ని చేర్చనున్నట్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సింగూర్ భూ ఉద్యమం బాగా కలిసి వచ్చింది. నాటి వామపక్ష ప్రభుత్వం టాటా చౌక కారు నానో కోసం ఆ సంస్థకు వ్యవసాయ భూములను కేటాయించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.

మిగిలిన ఉద్యమాలు కూడా...

దీనిపై జరిపిన పోరాటం మమతను సీఎం పదవి వరించేలా చేసింది. సుప్రీం కోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్చు ఇచ్చింది. బాధిత రైతులకు భూములను అప్పగించాలని టాటా సంస్థను ఆదేశించింది. దీంతో సీఎం మమతా బెనర్జీ ఆ భూములను స్వాధీనం చేసుకుని బాధిత రైతులకు తిరిగి పంపిణీ చేశారు.మమతా బెనర్జీ రాజకీయ ఎదుగుదలకు కారణమైన సింగూర్ భూ ఉద్యమాన్ని చారిత్రక పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ అసెంబ్లీలో తెలిపారు. దీంతో పాటు దేశంలోని కీలక ఉద్యమాలను కూడా స్కూల్ సిలబస్‌లో చేరుస్తామని ప్రకటించారు. సింగూర్‌ భూ పోరాట స్ఫూర్తితో తర్వాతి కాలంలో భూసేకరణ ఇష్టానుసారం చేయకుండా యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

Similar News