బురద కడుక్కోవడంపై భాజపా కుస్తీలు

Update: 2016-12-12 07:40 GMT

ఏపీ లో రాజకీయ శూన్యం ఉన్నదని భ్రమిస్తూ, దాన్ని తాము భర్తీ చేయాలని ఉత్సాహపడుతున్న బీజేపీకి ఇది కచ్చితంగా చిన్న కుదుపు. పార్టీ సభ్యత్వానికి ఇదివరకే రాజీనామా చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ లో చేరాలని నిర్ణయించుకోవడం మాత్రమే కాదు, బీజేపీ పై విమర్శలు చేసారు. అయన చల్లిన బురద కడుక్కోవడం ఎలా.. పార్టీ ప్రతిష్ట నిలబెట్టుకోవడం ఎలా అని బీజేపీ నాయకులు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు.

నామినేటెడ్ పదవుల విషయంలో చిన్న పట్టింపులు వచ్చి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసారు. తీరా ఇప్పుడు తన భవిష్యత్ రాజకీయ ప్రస్థానాన్ని వైసీపీ తో డిసైడ్ చేసుకున్నారు. ఏపీ లో వైసీపీ ప్రతిపక్ష పార్టీ గ చాల చక్కటి పోరాటం చేస్తున్నదని శ్రీనివాస్ కితాబులు ఇచ్చారు. అదొక రకం అయితే, బీజేపీ మన రాష్ట్రంలో చంద్రబాబు కు అనుకూలంగా మాత్రమే పని చేస్తున్నదంటూ ఆరోపణలు చేసారు.

ఒకవైపు తాము స్వతంత్ర పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే మరొకవైపు తమ పార్టీ చంద్రబాబు నీడలో బతుకుతున్నట్లుగా వస్తున్న విమర్శలు నష్టం చేస్తాయనేది వారి భయంగా ఉంది. ఈ బురదను కడుక్కోవాలంటే తాము చంద్రబాబు సర్కారు పట్ల సానుభూతి లేకుండా నిక్కచ్చిగా వ్యవహరించాలని వారు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం పట్ల కాస్త ఘాటుగా ఉండాలని పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తిప్పి తిప్పి శ్రీనివాస్ బీజేపీ మీద చేసిన విమర్శల ప్రభావంతో చంద్రబాబుకు సెగ తగిలేలా ఉంది.

Similar News