పెద్దాయన భయాలు సమంజసం, కానీ అవన్నీ త్యాగాలే!

Update: 2016-11-14 11:23 GMT

దేశానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో.. తాత్కాలికంగా వచ్చిన కష్టాలను ప్రజలు సహనంతో భరిస్తూనే ఉన్నప్పటికీ... ఇంకా అనేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేకించి రెండు సెలవు రోజులు శని, ఆది వారాల్లో బ్యాంకులు సేవలు కూడా అందించిన తరువాత.. మూడోరోజు సెలవు రావడంతో ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. నిజానికి బ్యాంకులు నిరంతరాయంగా పనిచేస్తుంటేనే ఏటీఎంల ముందు క్యూలలో ఉన్న జనానికి తగినంతగా సొమ్మును ఎప్పటికప్పుడు వాటిలో నింపడం జరుగుతోంది. ఏటీఎంలు పనిచేయకపోవడం వంటి పరిణామాలతో కష్టాలు మరింత పెరుగుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే భారతీయ ఆర్థిక వేత్తల్లో తనకంటూ విలువ, గుర్తింపు, గౌరవం ఉన్న పెద్దాయన , రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ మరోసారి ఈ వ్యవహారాలపై స్పందించారు. ఒకవైపు నోట్ల రద్దు నిర్ణయాన్ని రంగరాజన్ సమర్థిస్తూనే ఉన్నారు. నల్లధనం కట్టడి చేయాలంటే ఈ చర్యలు కొంతమేరకు ఉపకరిస్తాయని , ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు.

అదే సమయంలో.. ఇలాంటి చర్యల వల్ల దేశంలో రిటైల్ రంగం కుదేలవుతుందని రంగరాజన్ చెబుతున్నారు. నిజం చెప్పాలంటే.. ఆ ఎఫెక్టు ఇప్పటికే సమాజంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న చిన్న కిరాణాకొట్టుల దగ్గరినుంచి కూరగాయల వ్యాపారలు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల వారు, ఆటో డ్రైవర్లు ఇలాంటి అందరికీ కూడా.. ఈ నోటు దెబ్బ ప్రభావంగా వ్యాపారాలు విపరీతంగా పడిపోయాయి.

సినిమాహాళ్లు తక్కువ ప్రేక్షకులతో ఎలా వెలతెలపోతున్నాయో, చివరికి టిఫిన్ సెంటర్లు, హోటళ్ల వంటివి కూడా కస్టమర్లు లేకుండా ఎలా నీరుగారిపోతున్నాయో వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఒక రకంగా చూసినప్పుడు.. ఒక మంచి పరిణామాన్ని ఆశిస్తున్నప్పుడు.. జనసామాన్యానికి ఎదురవుతున్న ఇబ్బందుల్లాగానే.. వీటిని చిరు వ్యాపారులకు ఎదురవుతున్న ఇబ్బందులుగా పరిగణించాలి. జనానికి అనేక రకాల కష్టాలు ఎదురవుతున్నాయి. ఆఫీసు, లేదా కూలి పనులు మానుకుని బ్యాంకు క్యూలైన్లలో నిల్చుంటున్న వాళ్లు అనేకమంది కనిపిస్తున్నారు. జనం స్థాయిలో జనం ఈ కష్టాలను సహిస్తోంటే.. రిటైల్ వ్యాపారులు కూడా చిన్న చిన్న త్యాగాలతో ఈ నష్టాలను సహిస్తున్నారు. నిజానికి వ్యాపారాల మీద వచ్చే పన్నుల రూపేణా రాబడి తగ్గిపోవడంతో.. రాష్ట్రప్రభుత్వాలకు కూడా రాబడి తగ్గుతోంది. ప్రభుత్వాలు కూడా నష్టపోతున్నాయి.

రంగరాజన్ వంటి పెద్దాయన రిటైల్ వ్యాపారాల నష్టాల గురించి చెప్పారు గానీ.. ఆ ప్రభావం ప్రభుత్వాల రాబడుల మీద కూడా ఉంది. కానీ.. నల్లధనానికి కోతపెట్టడం వంచి మంచి పరిణామం కోసం ... వీటన్నింటినీ సహించడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారని అనిపిస్తోంది.

Similar News