నోటు కష్టాలు : రాష్ట్రాలు సహకరించడం బాధ్యత

Update: 2016-11-14 12:04 GMT

కేవలం కొన్ని రోజులు మాత్రం ఉంటాయి అనుకున్న ‘సామాన్యులకు కష్టాలు’ రోజులు గడుస్తున్నా ఇంకా కొనసాగుతున్నాయి. పనుల నిర్వహణ, వ్యవహారాలను చక్కబెట్టే ప్రక్రియలో భాగంగా అనివార్యంగా ఎదురయ్యే కొన్ని సమస్యలు , అంతిమంగా ప్రజల కష్టాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో సామాన్యులకు నోటు కష్టాలు ఒక కొలిక్కి వస్తాయనుకుంటే.. ఇవాళ్టిదాకా కొత్తవందనోట్లు అందుబాటులోకి రాకపోవడం, ఏటీఎంలు పనిచేయకపోవడం ఇలాంటి అనేక రకాల అనూహ్య కష్టాలు తెరమీదికి వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజల తాత్కాలిక ఇబ్బందులకు తగినట్లుగా పరిష్కారాలు చూపడానికి, వారికి సహకరించడానికి రాష్ట్రప్రభుత్వాలు రంగంలోకి దిగడం అవసరంగా, బాధ్యతగా మారుతోంది.

ఎన్డీయేతర పక్షాలు ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఎంత కష్టాలు పడితే వారిలో మోదీ సర్కారు మీద అంతగా వ్యతిరేకత ప్రబలుతుందనే కోరికతో రాష్ట్రప్రభుత్వాలు తమ బాధ్యతను గాలికొదిలేశాయి. కానీ కొన్ని రాష్ట్రాలు ఈ అంశాన్ని పట్టించుకుంటున్నాయి. చంద్రబాబునాయుడు కూడా ముమ్మరంగా ఈ అంశాన్ని సమీక్షిస్తున్నారు. ప్రభుత్వానికి అనివార్యంగా వచ్చే నష్టాల గురించి లెక్కలు వేయకుండా, బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఏం చర్యలు తీసుకోగలరో వారితో చర్చించారు. సూచనలు చేశారు.

నోట్ల రద్దు విషయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం పరంగా ఏ రకంగా ఆదుకోగలదో అన్ని చర్యలూ చేపట్టాలని ఆయన సూచిస్తున్నారు. ఈ పరిణామాల వల్ల ఖచ్చితంగా నల్లధనం తగ్గుతుందని, ఆన్ లైన్ లావాదేవీలు, మొబైల్ లావాదేవీలు పెరుగుతాయని దీనివల్ల ప్రజల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని , నిజాయితీ పరులు నిశ్చింతగా జీవించే రోజు వస్తుందని చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News