నల్లగొండకు ఏపీ అన్యాయం : గుత్తా

Update: 2017-01-30 08:04 GMT

పులిచింతల ప్రాజెక్టులో కనీస నీటి మట్టం లేకపోవడం వల్ల నల్లగొండ జిల్లా పంటలు ఎండిపోతున్నాయని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆరోపించారు. 42 టిఎంసిల సామర్ధ్యంతో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టులో బ్యాక్‌ వాటర్‌ మొత్తం నల్లగొండ జిల్లాలోనే ఉంటుంది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఏపీ చేతిలో ఉండటంతో తమకు నీరు దక్కడం లేదని గుత్తా ఆరోపించారు. పులిచింతలలో కనీసం నాలుగు టిఎంసీలైనా నీరు నిల్వ ఉండకపోతే పంటలతో పాటు నీటిఎద్దడి తీవ్రమవుతుందన్నారు.

గత సీజన్‌లో పులిచింతలలో దాదాపు 26 టిఎంసిల వరకు నీటిని నిల్వ చేశారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకున్నా దశల వారీగా నీటిని నిల్వ చేస్తున్నారు. అయితే కనిష్ట మట్టానికి మించి నీటిని వదిలేస్తుండటంతో నల్గొండలో రైతులు ఇబ్బంది పడుతున్నారని గుత్తా చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రి దేవినేని ఉమకు పలుమార్లు లేఖలు రాసినా స్పందించడం లేదని., కృష్ణాబోర్డు కూడా కనీసం నాలుగు టిఎంసిలు నిల్వ ఉంచాలని సూచించినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. దీనిపై నల్లగొండ జిల్లా రైతులు ఉద్యమించక ముందే ఏపీ సర్కార్ నీటిని విడుదల చేయాలని ఆయన కోరారు.

Similar News