తగ్గేదేలేదంటున్న కేసీఆర్

Update: 2017-11-01 06:24 GMT

తెలంగాణలో కొత్త సచివాలయం కట్టి తీరతామని ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు. ఈరోజు అసంబ్లీ సమావేశాల్లో కొత్త సచివాలయం నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. కొత్త సచివాలయం నిర్మించడానికి గల కారణాలను వివరించారు. దేశంలో అత్యంత చెత్త సచివాలయం హైదరాబాద్ లో ఉందన్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా వచ్చిన వెంటనే కొత్త సచివాలయాన్ని నిర్మించలేదా? అని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న సచివాలయానికి అగ్నిమాపకశాఖ అనుమతి కూడా లేదన్నారు. బైసన్ పోల్ గ్రౌండ్ లో నిర్మించ తలపెట్టిన సచివాలయం దేశంలోనే అత్యద్భుతంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే దారి గందరగోళంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ ప్రజలు తమ నిర్ణయానికి ఆమోదం ఇప్పటికే తెలిపారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ఈ విషయాన్ని తాను అనేకసార్లు స్పష్టంచేశానని, ప్రజామోదం ఉండటం వల్లనే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అన్ని సీట్లు వచ్చాయన్నారు. కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా లేని సచివాలయం ఎందుకన్నారు. తాము ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కట్టి తీరుతామన్నారు. సుప్రీంకోర్టును కూడా సంతృప్తి పర్చిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. దీనికి బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.

Similar News