డబ్బేం చేద్దాం? : ఉరకలెత్తుతున్న నేతలు, వ్యాపారులు !

Update: 2016-11-08 15:54 GMT

నల్లధనం దాచుకున్న వారి గుండెలు గుభేలు మన్నాయి. సర్కారుకు నివేదించిన ఖాతాల్లో చూపించకుండా.. పెద్ద మొత్తాల్లో నల్లడబ్బు దాచుకుని ఉన్న వాళ్లు ఇప్పుడు ఆ నోట్లను ఏం చేసుకోవాలో తెలియక సతమతం అయిపోతున్నారు. ప్రత్యేకించి డబ్బుకు అలవాటు పడిన రాజకీయ నాయకులు, అక్రమ మార్గాల్లో సంపాదన మరిగిన ఒకస్థాయి పెద్ద ఉద్యోగులు, వ్యాపారులు అందరూ కూడా.. ఇన్నాళ్లూ 500, 1000 నోట్ల డినామినేషన్లలోనే కోట్లకు కోట్ల రూపాయలు సొమ్ము దాచుకుంటూ ఉండడం కద్దు. అలాంటి వారికి ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కసారిగా అంత పెద్ద మొత్తాలకు లెక్కలు చూపించలేని పరిస్థితి, ఆ నోట్లను తక్షణం తమ తమ బ్యాంక్ అకౌంట్లలో వేసుకోకపోతే గనుక.. ఆ నోట్లు ఎందుకూ పనికి రాకుండా పోయే పరిస్థితి... ఇలాంటి సంకట స్థితిలో నల్లకుబేరులు కొట్టుమిట్టాడుతున్నారు.

ఇప్పుడు మోదీ ప్రకటించిన సంచలన నిర్ణయం విని దేశంలో మనశ్శాంతిగా ఉన్నదెల్లా ఎవరయ్యా అంటే... మధ్య తరగతి, పేద తరగతి వర్గాల ప్రజలు మాత్రమే. ఎవరి దగ్గరైతే ఇబ్బడి ముబ్బడిగా పెద్దమొత్తాల్లో సొమ్ములుండవో వారు మనశ్శాంతిగానే ఉన్నారు. అక్రమార్జనల్ని కోట్లలో దాచుకుని ఉన్నవారు.. బెంబేలెత్తిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసి.. ఎందరు వ్యక్తుల ద్వారా ఎంతమేరకు డిపాజిట్లు చేయించినా సరే.. తమ వద్ద ఉన్న మొత్తం డబ్బును వైట్ గా మార్చుకోవడం అంత సులభం కాదని భారీ స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని నల్లకుబేరులు భయపడుతున్నట్లు తెలుస్తోంది.

నల్లకుబేరుల వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. లేదా, వారి బినామీల పేరిట వీలైనంత మొత్తాలను వైట్ మనీగా మార్చుకునే ప్రయత్నాలు కూడా జరగవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.

Similar News