జనం ప్రశ్నించడం నేరిస్తే అంతే!

Update: 2016-09-26 00:45 GMT

జనం కష్టాల్లో ఉన్నప్పుడే అధికారంలో ఉన్న నాయకులు కనీసం పరామర్శకైనా తమ వద్దకు రావాలని ఆశిస్తారు. కానీ.. అలాంటి పరామర్శలకు వెళ్లే నాయకులకు భిన్నమైన అనుభవవాలు ఎదురవుతూ ఉంటాయి. జనానికి జవాబు చెప్పలేక పలాయనం చిత్తగించే పరిస్థితులూ ఎదురవుతాయి. తెలంగాణ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది.

వర్షాలు ఆదివారం నాడు ఒకింత తెరపినిచ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు పలు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి మహేందర్‌రెడ్డి కూడా కూకట్‌ పల్లి , కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. ఈ ప్రాంతాలు వర్షాల తాకిడికి అత్యంత దారుణంగా ఇబ్బంది పడ్డ ప్రాంతాలుగా గుర్తింపుతెచ్చుకున్న సంగతి తెలిసిందే.

అయితే మంత్రి పర్యటనలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక మహిళలు ఆయనను నిలదీశారు. ఇవన్నీ పర్మిషన్లు ఉన్న నిర్మాణాలే అని.. మీ ప్రభుత్వాలే పర్మిషన్లు కూడా ఇచ్చాయి కదా.. ఎలా ఇచ్చాయి. అంటూ ప్రశ్నించారు. తెరాస నాయకులు ప్రతి విషయానికి వల్లించే సిద్ధాంతం లాగా, ఈ ఘోరం అంతా పాత ప్రభుత్వాల పాపం అని చెప్పడానికి మహేందర్‌ రెడ్డి ప్రయత్నించారు. అయితే మహిళలు పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏదైనా డబ్బు తీసుకునే పర్మిషన్లు ఇస్తారు కదా.. అంటూ గట్టిగా అడిగారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడ్డానికి నేనిక్కడకు రాలేదు.. అని మహేందర్‌ రెడ్డి వారికి అసహనంగా జవాబు చెప్పి అర్థంతరంగా వెళ్లిపోవడం విశేషం.

అయినా జనం ప్రశ్నించడం నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని, నాయకులు పలాయనం చిత్తగించాల్సిందేనని జనం అనుకుంటున్నారు.

Similar News