ఛాన్సు వచ్చేసరికి కుమ్మి పారేశారు

Update: 2016-11-30 19:54 GMT

సాధారణంగా పోస్టాఫీసుల్లో అవినీతి చేయడానికి ఆస్కారం ఏం ఉంటుంది గనుక.. స్టాంపులు కవర్లు అమ్ముకోవడం తప్ప.. అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ యద్భావం తద్భవతి అన్నట్లుగా మనకు ఆ దృష్టి ఉండాలే కానీ.. మార్గాలు అనేకం కనిపిస్తాయి. అందుకే నోట్ల రద్దు, నోట్ల మార్పిడి అనే వ్యవహారం అమల్లోకి రాగానే.. జనం దృష్టిలో ఇలాంటి పోస్టాఫీసులమీద సానుభూతి ఉండగానే, నిఘా యంత్రాంగం దృష్టి అటువైపు మళ్లడానికి ముందే.. ఆ శాఖలో ఒక రేంజిలో కుమ్మి పారేశారు.

నల్లధనానికి కోరలు పీకేసి, నల్ల కుబేరులను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. రెండో పార్శ్వంలో పోస్టాఫీసుల్లోని కొందరు ఉన్నతాధికారులు బ్రోకర్లతో కుమ్మక్కయి కమిషన్లు పుచ్చుకుని పెద్ద మొత్తాల్లో పాతనోట్లను మార్పిడి చేసేశారు. కోట్లకు కోట్లు ఈ రూపంలో చేతులు మారిపోయాయి. అయితే క్రమంగా విషయం వెలుగుచూసి సీబీఐ విచారణ సాగించి, అక్రమాలకు పాల్పడిన పోస్టల్ అధికారులను గుర్తించింది. ఇప్పుడు ఈ పోస్టల్ అధికారులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

అదే మాదిరిగా.. ప్రెవేటు బ్యాంకుల్లో కూడా కమిషన్ల దందాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున నోట్ల మార్పిడి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బ్యాంకుల ద్వారా వచ్చిన కొత్త నగదు వాటి పంపిణీ జరిగిన తీరును కూడా సీబీఐ అధికారులు పరిశీలించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నల్లధనం కట్టడి చేయడానికి మోదీ ఒక చర్య తీసుకుంటే.. ఇదే మహదవకాశం మళ్లీ మళ్లీ వస్తుందో రాదో అని భావించి.. పోస్టాఫీసు, బ్యాంకుల్లోని అదికారులు ఎడాపెడా కమిషన్లు దోచేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి దందాలు దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా సాగినందువల్లనే.. నల్లకుబేరులు అందరూ నిశ్చింతగా ఉన్నారని, అన్నిరకాల ఇబ్బందులు సామాన్యులు మాత్రమే పడవలసి వస్తోందని అంటున్నారు.

Similar News