చంద్రబాబు చొరవతో ఉమా సవాలు నెరవేరేనా?

Update: 2016-11-19 03:40 GMT

రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందడం అనేది సుదీర్ఘ కాలంగా నేతల హామీలకు మాత్రమే పరిమితం అవుతున్న అంశం. రాయల సీమ జిల్లాల్లో పర్యటించే ప్రతిసారీ చంద్రబాబునాయుడు కూడా ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇటీవలి పరిణామాల్లో రెయిన్ గన్ ల వినియోగంతో కొంత ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన చంద్రబాబు, ప్రాజెక్టులకు నీరు వచ్చేలా చేయడంలో మాత్రం ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు, గోదావరి, కృష్ణ ల అనుసంధానం పర్యవసానంగా, సీమ ప్రాజెక్టులకు నీరు అందడంపై ఆశలు పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు మరింత ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది.

ఏకంగా దేవినేని ఉమా మహేశ్వరరావు.. విపక్షనేతకు విసిరిన సవాలు నిజం చేయడం అనేది లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారా అనిపిస్తోంది. వైఎస్ జగన్మోహనరెడ్డి నియోజకవర్గం అయిన కడపజిల్లా పులివెందుల రైతులు అనేక మంది సతీశ్ రెడ్డి నాయకత్వంలో శుక్రవారం నాడు అమరావతికి వచ్చి చంద్రబాబును కలిశారు. తమ చీనీతోటలకు నీళ్లు అందించే ఏర్పాటు చేయాలని వారు విన్నవించారు. వారి విజ్ఞప్తిని తప్పక పరిశీలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రత్యేకించి పులివెందుల రైతుల బృందం రావడం.. చంద్రబాబు హామీలు ఇవన్నీ గమనిస్తోంటే.. జగన్ కోట అయిన పులివెందుల లో శ్రద్ధ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్ కూడా గెలవడంటూ గతంలో దేవినేని ఉమా గతంలో సవాలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు పులివెందుల రైతులకు ఇస్తున్న హామీలు.. ఆ సవాలును నిజం చేయడంపై దృష్టిపెడుతున్నట్లే ఉన్నాయి.

రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనది అంటూ వారితో ప్రకటించిన చంద్రబాబునాయుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తిచేస్తానని వెల్లడించారు. చిత్రావతి గండికోట ప్రాజెక్టులను కూడా నింపుతామని అంటున్నారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులను నింపడం సాధ్యమైతే గనుక.. 400 టీఎంసీల నీటి నిల్వకు వీలుంటుందని చంద్రబాబు చెబుతున్నారు. క్రిష్ణ-పెన్న అనుసంధానం గురించి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయని వెల్లడించారు.

నిజానికి చంద్రబాబునాయుడు చెబుతున్న వాటిలో ఏ కొన్ని పూర్తయినా సరే.. రాయలసీమ సస్యశ్యామలం అవుతుందనడంలో సందేహం లేదు. నిజానికి ఇక్కడి రైతులు చాలాకాలంగా గాలేరు – నగరి కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు హయాంలో అది జరిగితే గనుక.. సీమ ప్రజల మన్నన పొందగలుగుతారనడంలో సందేహం లేదు.

Similar News