గుడ్డిలో మెల్ల : కొత్తగా కొన్ని సడలింపులు

Update: 2016-11-17 11:58 GMT

నోట్ల రద్దు వలన సర్కారు ఆశిస్తున్న బృహత్ ప్రయోజనాలను చూసి, కష్టాలను సహిస్తున్న ప్రజలకు వాస్తవంగా అనివార్యంగా ఎదురవుతున్న ఇబ్బందులు కూడా అనేకం ఉంటున్నాయి. రద్దయిన నోట్లు కట్నంగా ఇచ్చినందుకు కొన్ని పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెళ్లిళ్లలో పెడుతున్న ఖర్చుకు కొత్త నోట్లు సమకూర్చలేక, పాతనోట్లకు చెల్లుబాటులేక మరో రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఆస్పత్రుల్లో కూడా పాతనోట్లను ఆమోదించని పరిస్థితి. ఇలాంటి కొత్త సమస్యల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మరికొన్ని కొత్త సడలింపులను ప్రకటించింది.

ఎక్కువ మంది వినయోగదారులకు కొత్త నోట్లు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో, ప్రజల ఇబ్బందులు తగ్గించే ఉద్దేశంతో నగదు మార్పిడి పరిమితిని శుక్రవారం నుంచి 2000కు తగ్గించారు. దీనివలన ఎక్కువ మందికి ఇవ్వడం సాధ్యం అవుతుంది. అంతే తప్ప.. రద్దీ తగ్గుతుందనే గ్యారంటీ లేదు.

అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో శుభకార్యాలు ఉన్న వారు తగిన ఆధారాలు చూపించి.. ఒకేసారి 2.5 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులకు డ్రా చేయడానికి కేంద్రం అనుమతించింది. అయితే ఒక కుటుంబంలో ఒకరి ఖాతా నుంచి మాత్రమే ఈ మొత్తం డ్రా చేయడానికి అనుమతిస్తారు. నిజానికి ఈరోజుల్లో పెళ్లిళ్లకు జరుగుతున్న ఖర్చులతో పోల్చి చూసినప్పుడు.. 2.5 లక్షలు చాలా తక్కువ మొత్తమే అయినప్పటికీ.. ప్రభుత్వం ఆ మేరకు మాత్రమే అనుమతించింది. మిగిలిన ఖర్చుల విషయంలో ఎవరి కష్టాలు వారు పడాల్సిందే.

అలాగే ప్రధానంగా మార్కెట్ యార్డులు, వ్యవసాయానుబంధ హోల్ సేల్ వ్యాపారులు రైతు అనుబంధ సమస్యలకు గురికాకుండా ఉండడానికి కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. వారానికి ఒకేసారి 50 వేల వరకు వీరు విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. బుధవారం నాడు పార్లమెంటులో చర్చ సందర్భంగా సీపీఎం సీతారాం యేచూరి ప్రధానంగా.. రైతుల కష్టాలను ప్రస్తావించిన నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం అభినందనీయం. యేచూరి ప్రతిపాదనల్ని ప్రభుత్వం పరిశీలించాలంటూ తెలుగుపోస్ట్ ఓ కథనాన్ని కూడా అందించింది. అలాగే రైతులు తమకు మంజూరైన పంటరుణాలను అయితే ఒకేసారి 25 వేల వరకు కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి సడలింపులు కల్పించారు. నగదు లభ్యత గురించి ఆందోళన అనవసరం అని.. ప్రభుత్వం సరిపడా డబ్బు నిల్వలు ఉన్నాయని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ వెల్లడించడం విశేషం.

Similar News