కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కి బై బై చెప్పనున్నారా !

Update: 2016-03-29 14:28 GMT

తెలంగాణ కాంగ్రెస్ నుంచి మరో రెండు వికెట్లు డౌన్ కానున్నాయా?..ప్రస్తుతం పార్టీలో అంగబలం, అర్ధ బలమున్న ఆ ఇద్దరూ హై కమాండ్ తీరుతో విసిగి టీఆర్ఎస్ గూటికి చేరాలని భావిస్తున్నారా?..కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళితే..టీపీసీసీ చీఫ్.. నల్గొండ కాంగ్రెస్ లో హవా కొనసాగిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతిమ లక్ష్యం.. ఎన్నాళ్ల నుంచో ఆశిస్తున్న ఈ పదవిపై వారు ఇక కాంగ్రెస్ హైకమాండ్ తో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారట. దీనిపై హైకమాండ్ సానుకూలంగా స్పందించని పక్షంలో తమ దారి తాము చూసుకోవాలని వారు భావిస్తున్నారట. ఈ విషయాన్నే వారు ఢిల్లీలో తమకు అత్యంత సన్నిహితంగా మెలిగే దిగ్విజయ్ సింగ్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. ఆ పార్టీ..ఈ పార్టీ అనే తేడా లేకుండా కొంచెం పేరున్న నాయకులందరికీ పార్టీ కండువాలు కప్పేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో అసలు విపక్షం అనేదే లేకుండా చేయాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేయగల సత్తా అంగబలం.. అర్ధబలం ఉన్న తమకే సాధ్యమన్నది కోమటిరెడ్డి బ్రదర్స్ వాదన.ఆ మధ్య స్థానిక సంస్థల కోటాలో జరిగిన నల్లొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి వాదన రుజువైంది కూడా. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 55 మించి ఓట్లు రావని టీఆర్ఎస్ అంచనా వేసింది. అయితే దాన్ని తారుమారు చేస్తూ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 197 ఓట్లు సాధించి టీఆర్ఎస్ ను మట్టి కరిపించారు. ఆ ఎన్నికల్లో గెలుపొందడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వినికిడి. సో..ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు పార్టీ పగ్గాలు అందిస్తే తెలంగాణలోని పది జిల్లాల్లో కాంగ్రెస్ ను పటిష్టం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపు బాట పట్టిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ దిగ్విజయ్ సింగ్ కు పలుమార్లు స్పష్టంచేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ హై కమాండ్ నుంచి ఉలుకూ..పలుకూ లేకపోవడం వారికి రుచించడం లేదని అంటున్నారు.రెండు రోజుల క్రితం అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కాంగ్రెస్ హై కమాండ్ వైఖరిని దుయ్యబట్టారు. ప్రస్తుతం గాంధీభవన్ లో ఓట్లు లేని వాళ్లు రాజ్యమేలుతున్నారని, ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టే ఛాన్స్ లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. పరిస్థితిలో మార్పు రాకపోతే మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నట్టుగా ఆయన మాట్లాడారు.ఇప్పటివరకూ కాంగ్రెస్ వీడేది లేదంటూ తెగేసి చెప్పిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచనల్లో మార్పునకు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సంకేతమని పరిశీలకులు అంటున్నారు. ఇదిలాఉండగా గులాబీ గూటికి చేరే దిశగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికే సమాలోచనలు సాగిస్తోన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వచ్చే నెల 14న నల్గొండ ప్రభుత్వ కళాశాల నూతన భవనాలకు ప్రారంభోత్సవం జరుగనుంది. సొంత డబ్బులు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించాలనే ప్రయత్నం జరుగుతోన్నట్టు తెలుస్తోంది. దీనిని వేదికగా చేసుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ లో చేరే విషయంలో స్పష్టత రావచ్చన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Similar News