ఎంపీలకు కేసీఆర్ మార్గనిర్దేశనం

Update: 2017-01-26 06:20 GMT

పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలను టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ చెబుతున్నారు. వారికి దశాదిశానిర్దేశనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక పక్క సహకరిస్తూనే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై మాత్రం రాజీ పడకూడదని నిర్ణయించారు.

రాజీ పడొద్దు.....

‘కేంద్రానికి మద్దతివ్వడం వరకూ ఓకే. కాని అలా అని రాజీధోరణి మనకొద్దు. తెలంగాణకు కేటాయింపుల్లో అన్యాయం జరిగితే ఊరుకోవద్దు’అంటూ కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలకు హితబోధ చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఎంపీలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్ సమస్యలు, రావాల్సిన ప్రాజెక్టులు ఈ సమావేశాల్లో లేవనెత్తాలని వారికి చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జరిగే పరిణామాలపై మిగిలిన పార్టీలు పార్లమెంటును స్థంభింపచేస్తాయని, అయితే ఆ విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు ఆచితూచి వ్యవహరించాలని వారికి చెప్పారు. అయితే పెద్దనోట్ల రద్దుతో రాష్ట్రానికి కల్గిన నష్టాన్ని మాత్రం పార్లమెంటు సాక్షిగా వివరించాలన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేసేలా వత్తిడి తేవాలని ఎంపీలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.

నిధులు రాబట్టండి....

హైకోర్టు విభజన విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తేందుకు టీఆర్ఎస్ ఎంపీలు సిద్ధమవుతున్నారు. దీనికి ఇతర పార్టీల ఎంపీల మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నం చేయాలని వారికి కేసీఆర్ సూచించారు. అలాగే కొత్త రైల్వే లైన్ల మంజూరు, కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిలో బడ్జెట్ లో అన్యాయం జరిగితే వెంటనే ప్రశ్నించాలని కేసీఆర్ ఎంపీలకు మార్గనిర్దేశనం చేశారు.

Similar News