ఆకలి తీర్చడానికి అన్న పేరే పెట్టారు

Update: 2016-11-18 21:32 GMT

రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే.. సంక్షేమ పథకాలు అన్నటికీ తమ పార్టీలకు చెందిన అగ్రనేతల పేర్లు పెట్టుకోవడం.. తద్వారా ఆయా పథకాల వలన తమకు ప్రజల్లో మైలేజీ రావాలని కోరుకోవడం సహజమే. అదే క్రమంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు.. అన్ని పథకాలూ ఎన్టీఆర్ పేరిట మాత్రమే జరిగేవి. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబునాయుడు కొద్దిగా స్టయిలు మార్చి చాలా పథకాలకు తన పేరే పెట్టుకుంటున్నారు. చంద్రన్న కానుక, చంద్రన్న బీమా.. ఇలాంటివే. అయితే.. పేద ప్రజల ఆకలి తీర్చడానికి పెడుతున్న అన్న క్యాంటీన్లకు మాత్రం ‘అన్న’ పేరే పెడుతుండడం విశేషం. తెలుగుజాతి అన్నగా కొలుచుకునే అన్న ఎన్టీఆర్ పేరిటే... క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ఏర్పాటు చేయబోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ‘అన్న కేంటీన్లు’ అతి త్వరలోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముందుగా నగరాలు, పట్టణాలలో ‘అన్న కేంటీన్ల’ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సామాన్యులకు సైతం నాణ్యమైన ఆహారాన్ని అతి తక్కువ ధరకే పరిశుభ్రమైన వాతావరణంలో అందించేలా చూడాలని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలోని తన కార్యాలయంలో ‘అన్న కేంటీన్ల’పై పౌరసరఫరాల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

అత్యుత్తమంగా ‘అన్న కేంటీన్ల’ను నెలకొల్పేందుకు తమిళనాడులో నిర్వహిస్తున్న ‘అమ్మ కేంటీన్ల’ను పరిశీలించడంతో పాటు, దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, అక్షయ పాత్ర ఫౌండేషన్‌తోనూ చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇవి ఆచరణలోకి వచ్చాయి. వెలగపూడి సచివాలయం వద్ద కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

Similar News