ఆ లేఖ రెచ్చగొట్టేదేనన్న చంద్రబాబు

Update: 2018-03-24 09:54 GMT

అమిత్ షా లేఖలో పేర్కొన్నవన్నీ అవాస్తవాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మమ్మల్లి అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారన్నారు. శాసనసభలో ఆయన అమిత్ షా రాసిన లేఖపై స్పందించారు. ఏపీ పట్ల ఎందుకీ వివక్ష అని ఆయన ప్రశ్నించారు. రావాల్సినవి అడిగితే ఎదురు దాడి చేస్తున్నారన్నారు. హోదాతో సమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఎందుకు మాట తప్పారని చంద్రబాబు నిలదీశారు. విభజన హామీల అమలును కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆందోళన చేస్తున్నా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీలో ఇంత ఆందోళనలు జరుగుతుంటే కన్పించడం లేదా? అని అడిగారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని అడిగినా ఎందుకు ఇవ్వలేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు అన్నీ ఇస్తున్నారు కాని ఏపీకి ఇవ్వడానికి మాత్రం మనసొప్పడం లేదన్నారు. ఈఏపీ ఇస్తామని చెప్పి పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. తామేమీ కొత్తవి అడగటం లేదని, విభజన హామీల్లో ఉన్నవే అమలుపర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దాడి చేస్తూ అమిత్ షా లేఖ కొన సాగిందన్నారు. తొమ్మిది పేజీల లేఖలో అసత్యాలున్నాయన్నారు. ఇది తనకు రాసిని లేఖ కాదని, ఈ రాష్ట్రాన్ని కించపరుస్తూ, రెచ్చగొడుతూ రాసిన లేఖ అని చంద్రబాబు అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే, ఒక సీనియర్ నేతగా, నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నేతగా తాను ఎన్డీఏ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అసత్యాలు చెప్పకూడదన్నారు. కేంద్రం పారిశ్రామిక రాయితీలు ఇచ్చుంటే..ఏపీకి ఇంకా పరిశ్రమలు వచ్చి ఉండేవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విభజన బిల్లు కాంగ్రెస్ పెడితే సహకరించింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. బడ్జెట్ చూసిన తర్వాత మీరు ఏపీకి ఇక న్యాయం చేయరనిపించి ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. అన్నీ చెప్పే చేశామన్నారు.

Similar News