అంతా ఆన్ లైన్ లోనే...గప్ చిప్ గా

Update: 2018-03-21 02:13 GMT

ఇప్పడు డ్రగ్స్ దందా రూపం ఛేంజ్ అయ్యింది. అంతా ఆన్ లైన్ లోనే తమ వ్యాపారం చేసుకుంటున్నారు. తమ కస్టమర్లను సొషల్ మీడియాలోనే కాంటాక్టవుతున్నారు. కొందరైతే పర్సనల్ నెంబర్ వున్న వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మరికొందరు వాట్సాప్ గ్రూప్ లను పెట్టి మరీ ఈ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. .హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా మళ్లీ కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ముఠాలు పట్టుబడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు వ్యాపారులు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్న మరో గ్యాంగ్‌ పోలీసులకు దొరికింది.

గోవా నుంచి ఇక్కడకు....

హైదరాబాద్‌లో డ్రగ్స్‌... మళ్లీ హాట్‌ టాపిక్‌. ఈ మధ్య కాలంలో వరుసగా డ్రగ్స్‌ ముఠాలు దొరుకుతున్నాయి. గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్న బాగోతాలు ఇటీవల బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే డ్రగ్స్‌ వ్యాపారులుగా మారిన విద్యార్థుల్ని పట్టుకున్నారు పోలీసులు. ఇప్పుడు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా చెక్కపల్లి గ్రామానికి చెందిన గణేష్‌ కుమార్‌... హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొండాపూర్‌లో నివాసముంటున్నాడు. తన స్నేహితులైన అరవింద్ రెడ్డి, ప్రవీణ్, మహేశ్‌లతో తరుచూ గోవాకు వెళ్లి వస్తుండేవాడు. ఇతనికి గోవాలో కాశ్మీర్‌కు చెందిన డ్రగ్స్‌ పెడ్లర్‌ అర్బిద్ మీర్‌తో పరిచయముంది. గోవాలో గంజాయికి డిమాండ్‌ ఉందని... హైదరాబాద్‌ నుంచి తీసుకురావాలని గణేష్‌ స్నేహితుల్ని అడిగాడు అర్బిద్‌. ఒప్పందం ప్రకారం ఇక్కడ్నుంచి గంజాయి తీసుకెళ్లేవారు. అక్కడ్నుంచి ఎల్‌ఎస్‌డీ లాంటి ఇతర డ్రగ్స్‌ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మేవారు. ఇలా డ్రగ్స్‌ దందా సాగుతుండగానే అర్బిద్‌ను అరెస్ట్‌ చేశారు గోవా పోలీసులు. గోవా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను అరవింద్ రెడ్డి ఇక్కడ అమ్మేవాడు. ఇలా గణేశ్, అరవింద్‌లు తమ వాట్సప్‌లో ఆర్డర్లు తీసుకొని కస్టమర్లకు మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారు. వీరి దందాపై సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు మొదట అరవింద్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత నిఘా పెట్టి గణేష్‌తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. గోల్కొండకు చెందిన షేక్ అహ్మద్, కిషన్ బాగ్‌కు చెందిన షేక్ రషీద్‌ల నుంచి కిలో గంజాయి, గణేశ్‌ నుంచి 15 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, పది ఆంఫెటమైన్‌ ట్యాబ్లెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గణేశ్, అరవింద్‌లు నగరంలోని పలు ఎమ్మెన్సీ కంపెనీల ఉద్యోగులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలింది.

Similar News