వైసీపీ నేత విచారణ... గుంటూరులో ఉద్రిక్తత

Update: 2018-11-06 08:03 GMT

గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేశ్ ను ఇవాళ పోలీసులు విచారిస్తున్నారు. వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు టీడీపీ కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఐడీ కార్డును ఆయన మీడియాకు చూపించారు. అయితే, తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా జోగి రమేశ్ ను ఇవాళ విచారణకు పిలిచారు. దీంతో ఆయన వైసీపీ నాయకులతో కలిసి విచారణకు హాజరయ్యారు. మిగతా నాయకులను బయటే ఉంచిన పోలీసులు జోగి రమేశ్ ను విచారిస్తున్నారు.

పెద్దఎత్తున చేరుకుంటున్న రెండు పార్టీల కార్యకర్తలు

విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు జోగి రమేశ్ కు సంఘీభావంగా పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. వీరికి పోటీ టీడీపీ నేతలు కూడా సమీపంలోనే మొహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, జగన్ ను కైమా చేస్తామన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని, పెద్ద ప్లాన్ చేస్తామన్న మంత్రి సోమిరెడ్డిని ఎందుకు విచారించడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హత్యాయత్నం కేసును తప్పుదోవ పట్టించేందుకు తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.

Similar News