స్టాలిన్ తో సాంబార్ ఇడ్లీ...కుమారస్వామితో కులాసా కబుర్లు

Update: 2018-11-20 11:44 GMT

రాష్ట్రంలో 520 మండలాల్లో కరువు తాండవిస్తుంటే ఏనాడు పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రాలు తిరుగుతూ దేశాన్ని ఉద్దరిస్తానని పోజులు కొడుతున్నాడని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కురుపాంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

- రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా... చంద్రబాబుకు జాతీయ సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు కావాలంట... ఇంకా అడిగితే అంతరిక్ష సమస్యలు కూడా అవసరమంటున్నారు.

- ముఖ్యమంత్రి అనే వ్యక్తి తన పరిపాలన చూసి ఓట్లేయాలని అడగాలి. కానీ తన అవినీతి, మోసపు, అబద్ధాల పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష సమస్యల మీద పోరాటం అంటున్నాడు.

- రాయలసీమలో పడాల్సిన సగటు వర్షపాతంలో సగం వర్షం కూడా పడలేదు. 50 శాతం లోటు వర్షపాతం నమోదైతే చంద్రబాబు సీమలోని పోలాల్లోకి అడుగుపెట్టకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో దేవెగౌడ వద్దకు వెళ్లి పీఎం పదవి కోసం మాట్లాడుతాడు.

- చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మైనస్ 47.3 శాతం వర్షపాతం లోటు ఉండగా పక్కనే ఉన్న తమిళనాడు వెళ్లి స్టాలిన్ తో సాంబార్ ఇడ్లీ తిని రెండు ఫోటోలకు పోజు ఇస్తాడు. ఇద్దరం కలిసి జాతీయ రాజకీయాలను ఏలుదామంటాడు.

- నెల్లూరులో మైనస్ 66.9 శాతం, ప్రకాశంలో మైనస్ 58.1 శాతం వర్షపాతం లోటు ఉంటే పట్టించుకోకుండా ప్రత్యేక విమానంలో బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీతో టిఫిన్ తిని శాలువా కప్పి సన్మానం చేసి దేశాన్ని ఏలుదామంటాడు.

- ఆపరేషన్ గరుడ అని చంద్రబాబు యాగి చేస్తున్నాడు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఢిల్లీ పెద్దలు కుట్ర చేస్తున్నారని టీవీల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లే చంద్రబాబు దీనిపై విచారణ జరిపించాలని రాష్ట్రపతిని ఎందుకు కలవలేదు ? సుప్రీంకోర్టులో ఎందుకు కేసు వేయడు ? విచారణ జరిగితే చంద్రబాబే దొంగ అని తేలుతుందని విచారణ కోసం అడగడం లేదు.

- ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు జరగకుండా చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళతాడట. ప్రత్యేక హోదా కోసమో, రాష్ట్ర సమస్యల కోసమో సుప్రీం కోర్టుకు ఎప్పుడూ వెళ్లని చంద్రబాబు తన వాళ్లపై ఐటీ దాడులు జరుగుతుంటే సుప్రీంకోర్టుకు వెళతాడంట.

- చంద్రబాబు దోపిడీపై హైకోర్టు గనుక విచారణ జరిపించాలని ఆర్డరు ఇస్తే మన రాష్ట్రానికి హైకోర్టు వద్దు అని కూడా అంటాడు. సుప్రీంకోర్టు గనుక ఇటువంటి ఆదేశాలు ఇస్తే ఏపీ వ్యవహారాలు సుప్రీంకోర్టు కిందకు రాదని కూడా జీఓలు ఇచ్చే ఘనుడు చంద్రబాబు.

- ఆగ్రిగోల్డ్ సమస్యతో లక్షల మంది పేదలు ఇబ్బందుల్లో ఉంటే, ఆగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయడానికి చంద్రబాబు ప్రయత్నాలను చూస్తుంటే శవాల మీద చిల్లర ఏరుకునేలా కనిపిస్తోంది.

Similar News