తెలుగు సీఎంలకు షాక్ ఇచ్చిన బెంగాల్ ఎంపీ

Update: 2018-07-26 10:21 GMT

ఫెడరల్ ఫ్రంట్ పెట్టి జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం విపక్షాలన్నీ కలిపి ఏర్పాటు చేసే కూటమిలో ప్రధాన భూమిక పోషించాలనే ఆలోచనలో ఉన్నారు. గతంలోనే ఆయన కేంద్ర ప్రధానులను నిర్ణయించానని, తనకంటే ఎవరూ సీనియర్ లేరని చెబుతున్నారు. అంటే, కొత్త కూటమిలో తానే కీలకమని చెప్పకనే చెబుతున్నారు. కేసీఆర్ సైతం మొదట ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనతో మమతా బెనర్జీతో పాటు కరుణానిధి, దేవెగౌడ, సోరెన్ కుటుంబాలను కలవడంతో అంతా కేసీఆర్ దే కీ రోల్ ఉంటుందని భావించారు. కాగా, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రేయిన్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు షాక్ ఇచ్చాయి.

మమతా బెనర్జీనే అందరికంటే సీనియర్

ఆయన రానున్న ఎన్నికల గురించి మాట్లాడుతూ...ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆలోచించాల్సిన సమయమిదని, బీజేపీని ఓడించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీనే ఫెడరల్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తారని ఆయన పేర్కొన్నారు. మమతా బెనర్జీని మించిన సీనియర్ నేత ఎవరూ లేరని, ముఖ్యమంత్రిగా, ఎంపీగా నలభై ఏళ్లుగా ఆమెను ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మమత సైతం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు పార్టీలతో ఈ దిశగా చర్చలు జరిపారు. ఈ నెల 31న కూడా ఆమె ఢిల్లీ వెళ్లి పలు పార్టీల నేతలను కలువనున్నారు. జనవరిలో బెంగాల్ లో నిర్వహించే మహా ర్యాలీకి కూడా విపక్ష నేతలను ఆహ్వానించి ఎన్నికల శంఖారావం పూరించాలని ఆమె భావిస్తున్నారు.

Similar News