అమరావతిలోనూ తెలంగాణ ఎన్నికల ప్రచారం

Update: 2018-11-30 05:00 GMT

అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారం చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ఉండవల్లి ప్రజా వేదికలో 13 జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. హైద్రాబాద్ ప్రగతి, పురోగతి అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ ఇండస్ట్రీ పురోగతిలో తన పాత్రను కలెక్టర్లకు బాబు వివరించారు.

రాజకీయాలు తప్పదు....

తమకు పాలనతో పాటు రాజకీయాలు చేసుకోక తప్పదన్నారు. దేశ రాజకీయాలు రాష్ట్ర,దేశ భవిష్యత్తు ను నిర్ణయిస్తాయని, తెలంగాణ ఎన్నికల్లో ప్రచారంతో గొంతు పోయిందని తెలిపారు. అవతలి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నపుడు నిజానిజాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని తీరుతో దేశం మొత్తం అసంతృప్తితో ఉందని అన్న బాబు చెప్పిన పనికి చేసే దానికి పొంతన లేక.. మోదీ .విశ్వాసం కోల్పోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ 16 వేల కోట్లు ఖర్చు పెట్టామని, ప్రాజెక్ట్ నిర్వాసితుల కు పరిహారం బాధ్యత కేంద్రానిది తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలవరం విషయంలో ముందుకెళ్తామన్నారు.

ఫామ్ హౌస్ తప్ప....

హైద్రాబాద్ అభివృద్ధి,శంషాబాద్ విమానాశ్రయం,మెట్రో రైల్ ఏర్పాటుకు తాను ఎంత కష్టపడింది అధికారులకు వివరించారు. తాను తీసుకున్న చర్యలవల్లే హైద్రాబాద్ తెలంగాణకు పెద్ద ఆస్తిగా మారిందన్నారు. ఇప్పటికీ హైద్రాబాద్ వదిలి ఇక్కడికి రావడానికి ఎవరూ ఇష్టపడటం లేదన్నారు. కేసీఆర్ పొద్దకా తనను విమర్శిస్తున్నారన్నారు, కేసీఆర్ వచ్చాక ఏమి కట్టాడని, ఫామ్ హౌస్ తప్ప ఏమీ కట్టలేదని తెలిపారు. మొత్తం మీద అమరావతిలోనూ ఏపీ సీఎం తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారన్న గుసగుసలు ఆ సమావేశంలోనే విన్పించడం విశేషం.

Similar News