వామ్మో వీడు దేశముదురు....!

Update: 2018-06-28 02:52 GMT

అలాంటి ఇలాంటి జాదుగాడు కాదు వాడు... వీడు దేశముదురు... డబ్బుల కోసం ఏదైనా చేస్తాడు... అక్రమ సంపాదనే లక్ష్యంగా ప్లాస్టిక్ వేలిముద్రలే సృష్టించాడు. వివిధ మొబైల్ కంపెనీలకు కుచ్చుటోపి పెట్టాడు. సిమ్ కార్డుల పేరుతో అమ్మితే వచ్చే కమీషన్ కోసం కక్కుర్తి పడ్డాడు. మొసపోయామని తెలుసుకున్న సదరు సిమ్ కార్డుల కంపేనీ పోలిసులను ఆశ్రయించింది. దీంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇంతకీ ఏవరా జాదూగాడు....?

సిమ్ కార్డుల పేరిట....

అతని పేరు సంతోష్ కుమార్.. పెద్దపల్లి జిల్లా ధర్మాపురంలో సిమ్ కార్డుల ఏజెంట్ గా వ్యాపారం సాగిస్తున్నాడు. సిమ్‌ కార్డులు అమ్మితే వచ్చే కమీషన్‌ కోసం కక్కుర్తి పడి ఆయా కంపెనీల సిమ్‌ కార్డులు అమ్ముతూ రెండు చేతులా సంపాదించాడు. సిమ్ కార్డుల కంపెనీకి కుచ్చుటోపి పెట్టాడు. డబ్బు ఏదైనా చేయింస్తుందన్న చందంగా కొంతం మంది వినియోగదారులు సిమ్‌ కార్డులు కొనుగోలు చేయకపోయినా వారి ప్లాస్టిక్‌ వేలిముద్రల ద్వారా సంతోష్‌ కుమార్‌ సిమ్ కార్డులు అమ్మాడు. సంతోష్ కుమార్ ఖాతాలో సదరు నెట్ వర్క్ సంస్ధ డబ్బులు కూడా జమచేసింది. కాని సిమ్‌కార్డులు రీ-ఛార్జి కాకపోతుండటంతో సదరు సంస్థకు అనుమానం వచ్చి సంస్ధ ప్రతినిధులతో పరిశీలన చేయించింది. ఇదంతా వేలిముద్రల మాయాజాలంతో ఏజెంట్లు ఫ్రాడ్ చేశారన్న అనుమానం వచ్చి హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. వోడాఫోన్‌ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆధార్‌ కార్యాలయం ఉపసంచాలకులకు ఫిర్యాదు చేశారు. ప్లాస్టిక్‌ వేలిముద్రల్ని సృష్టించడం, ఆధార్‌ డేటాతో అవి సరిపోలడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. సాంకేతిక నిపుణుల ద్వారా వివరాలు సేకరించగా ఆధార్‌ డేటా బేస్‌లోని వివరాలు పాస్టిక్‌ వేలిముద్రలతో సరిపోలవనీ, మరేదైనా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాడో తెలుసుకోవాలంటూ పోలీసులకు చెప్పడంతో ప్రస్తుతం జైల్లో ఉన్న సంతోష్‌ కుమార్‌ను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు.

నెట్ వర్క్ లకు ఏజెంటుగా.....

నిందితుడు సంతోష్‌ కుమార్‌ కొన్ని నెలలుగా వోడాఫోన్‌తో పాటు పలు నెట్‌వర్క్‌లకు ఏజెంట్‌గా ఉంటున్నాడు. ఎక్కువ కార్డులు అమ్మి, అధిక కమీషన్‌ పొందేందుకు యూట్యూబ్‌లో శోధించి, ప్లాస్టిక్‌ వేలిముద్రలను పాలిమర్‌ స్టాంప్‌ ఎక్స్‌పోజర్‌ ద్వారా తయారు చేయవచ్చని గుర్తించారు. ఆ సాంకేతికతను అంతర్జాలం ద్వారా కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ నుంచి ఆస్తులు, పొలాలు కొనుగోలు చేసిన వారి వేలిముద్రలు సేకరించి, వాటికి ప్లాస్టిక్‌ వేలిముద్రల నకలు తయారు చేశారు. అనంతరం వారిపేరిట సిమ్‌కార్డులు కొనుగోలు చేసి.. వొడాఫోన్‌కు వివరాలు ఇచ్చి సంస్థ నుంచి కమీషన్‌ పొందుతుండగా ఈ వ్యవహారం బయటపడింది. కాగా ఈ విషయాన్ని నగర్ పోలిస్ కమీషనర్ ను వివరణ అడగ్గా ఈ కేసు విచారణలో ఉందని పూర్తి వివరాలు విచారణ అనంతరం వెస్ట్ జోన్ డిసిపి మీడియాకు వెల్లడిస్తారని దాటవేశారు.

ప్లాస్టిక్ వేలిముద్రలు సరిపోతాయా?

సంతోష్‌కుమార్‌ వద్ద ఉన్న వోడాఫోన్‌ ఈ - కేవైసీ యంత్రం పనితీరును పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు. వేలి స్పర్శకు, ప్లాస్టిక్‌ వేలిముద్రకు తేడా కచ్చితంగా ఉంటుందన్నారు. ప్లాస్టిక్‌ వేలిముద్రను ఆధార్‌ డేటాబేస్‌ ఉన్న యంత్రం గుర్తించదనీ, మరి.. సంతోష్‌ కుమార్‌ ఎలాంటి పరిజ్ఞానం ఉపయోగించాడో తెలుసుకునేందుకు ఐటిసెల్ పోలిసుల సహాకారాన్ని తీసుకుంటున్నారు. ఇన్విస్టిగేషన్ నిమిత్తం వీటిని ఐటిసెల్ శాఖకు అందజేశారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు న్యాయస్థానం అనుమతితో నిందితుడిని కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి.....

నకిలీ వేలిముద్రల తయారీకి ఆధార్‌ సంఖ్య, వేలిముద్రలను రిజిస్ట్రేషన్‌శాఖ వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో తెలంగాణ రాష్ట్ర స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు తీసుకుంది. సర్టిఫైడ్‌ కాపీలకు దరఖాస్తు చేసుకునే ముందు నిర్ధారించుకునేందుకు వీలుగా అమలైన రెండు పేజీలు అందుబాటులో ఉండే విధానాన్ని రద్దు చేశారు. గతంలో ఉన్న విధానం ప్రకారం రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ తీసుకోవాలనుకునేవారు స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డాక్యుమెంట్‌ సంఖ్య, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పేరు వంటి వివరాలు నమోదు చేస్తే ఆ డాక్యుమెంట్‌కు సంబంధించి మొదటి పేజీ, రెండో పేజీలు స్క్రీన్‌పై కనబడతాయి. మొదటి పేజీలో ఆధార్‌ సంఖ్య సహా ఇతర వివరాలు ఉంటాయి. రెండో పేజీలో వేలిముద్రలు ఉంటాయి. ఎవరికైనా ఇవి అందుబాటులో ఉండటంతో నకిలీ వేలి ముద్రల తయారీకి ఈ సమాచారం ఉపయోగించుకున్నారు నిందితుడు.

Similar News