కేసీఆర్ కుటుంబం వారితోనే పోటీ పడుతోంది

Update: 2018-08-03 11:07 GMT

కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దివాళా తీయగా, కేసీఆర్ కుటుంబం మాత్రం దివాళా స్థాయి నుంచి దేశంలోనే అత్యంత సంపన్నుల స్థాయి చేరిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ... కేసీఆర్ కుటుంబం సంపాదనలో అదానీ, అంబానీలతో పోటీ పడుతుందని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మితమవుతున్న ప్రాజెక్టులలో భారీగా అవినీతి చోటుచేసుకుంటుందని, ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసీఆర్ ప్రభుత్వం దాడులు నిర్వహిస్తుందని ఆరోపించారు.

ఇది అవినీతి కాదా..?

ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి 2016 రూ.7926 కోట్లతో పాలనా అనుమతులు ఇచ్చారని, కానీ, ఇప్పుడు అదే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 13,057 కోట్లకు పెంచుతూ నిన్న కొత్త జీఓ ఇచ్చారని ఆరోపించారు. కేవలం రెండేళ్లలోనే సుమారు 5200 కోట్లు అంచనా వ్యయం పెంచడం వెనుక దోపిడీ ఉందా లేదా అని ప్రశ్నించారు. తాము కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడితే, దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం చిల్లర మాటలు, ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పదవీకాలం దగ్గరపడుతున్నందున అందినకాడికి దోచుకోవడానికి ఇలా అంచనాలు పెంచారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News