టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ రేవంత్

Update: 2018-09-01 08:37 GMT

నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ జరుగుతోంది, న్యాయస్థానాలు స్పందించి సూమోటోగా కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సభ పేరుతో టీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ డబ్బుల కోసం స్థానిక వ్యాపారులను బెదిరిస్తున్నారని, స్కూల్ బస్సులు కావాలని యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నారన్నారు. సభ నిర్వహణలో ఉల్లంఘనలు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లలో ప్రజలను తరలిస్తున్నారని పేర్కొన్నారు. టోల్ గేట్ల వద్ద పన్ను వసూలు చేయవద్దని చెప్పారని, ఈ డబ్బునంతా టీఆర్ఎస్ పార్టీనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

నిజంగా హీరోలైతే మాట్లాడరేం..?

హరిత ఛాలెంజ్ పేరుతో సినిమా వాళ్లకు, నాటకాల వాళ్లకు, కృష్ణా నగర్ వాళ్లకు, ప్రగతి భవన్ వాళ్లకు చెట్లు నాటాలని సవాల్ విసురుతూ షో చేసిన టీఆర్ఎస్ నాయకులు ప్రగతి నివేదన కోసం విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంతకుముందు వారి సవాల్ స్వీకరించి చెట్లు నాటిన హీరోలు ఇప్పుడు చెట్లు కొట్టేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నిబందనలకు విరుద్ధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి అడ్డగోలుగా సభ కోసమే కొత్త రోడ్లు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన కళాకారులతో సభలో పాటలు పాడించుకోవడం కూడా సరికాదన్నారు. వీటిని సమోటోగా స్వీకరించి, కేసీఆర్ సహా కారకులైన అందరిపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

Similar News