కొడంగల్ లో రాహుల్ కేక పుట్టించారే

Update: 2018-11-28 08:18 GMT

ఇవాళ తెలంగాణలో అధికారం మొత్తం కేసీఆర్ కుటుంబంలోని నలుగురు వ్యక్తుల చేతిలో ఉందని, ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ప్రజల చేతిలోకి అధికారం తీసుకువస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కలలు గన్న నీళ్లు - నిధులు నియామకాలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కచ్చితంగా తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

- తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది. ఇవాళ తెలంగాణ ఆదాయం 2 లక్షల కోట్లకు పెరిగింది. ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కానీ, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.60 వేల కోట్ల అప్పు ఉంది. అదే సమయంలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఆదాయం మాత్రం 400 శాతం పెరిగింది.

- కాంగ్రెస్ ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ రీడిజైన్ పేరుతో మళ్లీ మొదలుపెట్టారు. కాంగ్రెస్ 50వేల కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు మొదలుపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుగా కేసీఆర్ పేరుమార్చి 80 వేల కోట్లకు వ్యయం పెంచారు. కేవలం పేరు మార్చి 30 వేల కోట్లు వ్యయం పెంచారు.

- మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకంలో పాత ట్యాంకులకు పెయింట్లు వేసి కుంభకోణం చేశారు.

- లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారు. నాలుగేళ్లుగా కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆలోచించండి. కేసీఆర్ కుటుంబంలో నలుగురికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. ఈ నలుగురే నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్ నాశనం చేశారు.

- మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ స్వయం సహాయక సంఘాలను ప్రారంభిస్తే కేసీఆర్ ప్రభుత్వం వారికి కూడా మద్దతు ఇవ్వలేదు. మహిళల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు లక్ష రూపాయలు గ్రాంటు ఇస్తాం. మహిళా వ్యాపారులకు రూ. 5 లక్షల రుణం ఇస్తాం.

- రాష్ట్రంలో 22 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి కనీసం 5 వేలు కూడా కట్టలేకపోయారు.

- దళితులు, గిరిజనులకు భూమి ఇస్తానని కూడా కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారు.

- మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు, దళిత, గిరిజనులకు భూములు కూడా కచ్చితంగా ఇస్తాం.

- ప్రతీఒక్క యువకుడికి ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం.

- ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ప్రతి పేద కుటుంబానికి వైద్య ఖర్చుకు రూ.5 లక్షలు అందిస్తాం.

- పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తాం.

- ఈరోజు అధికారం మొత్తం ఒక్క కుటుంబం చేతిలో ఉంది. ఆ అధికారంలో పేదలకు భాగస్వామ్యం కల్పిస్తాం.

- తెలంగాణలో కచ్చితంగా ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజలు ఏవైతే కలలు కన్నారో, ఏ కలల కోసం అయితే పోరాడారో, ఎందుకోసమైతే సోనియా గాంధీ మద్దతు ఇచ్చారో, ఆ కలలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే కలను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుంది.

- తెలంగాణలో ప్రజాకూటమి వచ్చాక ప్రతీదగ్గర ప్రజలకు ప్రాధాన్యత, భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ను, 2019లో దేశంలో నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ ఓడించబోతోంది. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎన్ ను కాంగ్రెస్ ఓడిస్తుంది.

Similar News