ఎయిర్ టెల్ ఎంత పని చేసింది?

Update: 2018-06-19 07:05 GMT

ఎయిర్ టెల్ కంపెనీ చేసిన ఒక పనితో నెటిజన్ల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. పూజా సింగ్ అనే ఓ మహిళ తన డీటీహెచ్ లో సమస్య ఉందని ఇంజనీర్ ని పంపమని కోరింది. దీంతో షోయబ్ అనే వ్యక్తిని కంపెనీ పంపించింది. అయితే, తాను హిందువునని, హిందూ ఇంజనీర్ నే పంపాలని పూజా ఎయిర్ టెల్ కి మళ్లీ ఫిర్యాదు చేసింది. దీంతో షోయబ్ ను వెనక్కి పిలిచి ఓ హిందూ వ్యక్తిని పంపింది ఎయిర్ టెల్. అయితే, కంపెనీకి చెందిన వారికి, తనకు మధ్య సంభాషణను పూజానే స్వయంగా ట్విట్టర్ లో పెట్టింది. దీంతో ఇప్పుడు నెటిజన్లు పూజాతో పాటు ఎయిర్ టెల్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. కంపెనీ ఉద్యోగికి కనీసం మద్దతు పలకకపోగా, మత విధ్వేషం ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నారని ఎయిర్ టెల్ పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. ఎయిర్ టెల్ వైఖరికి నిరసనగా తన మొబైల్ సర్వీసు, డీటీహెచ్, బ్రాడ్ బ్యాండ్ సేవలను తొలగించాలనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అయితే, నష్ట నివారణ కోసం ఎయిర్ టెల్ ప్రయత్నం చేస్తోంది. వినియోగదారులను, ఉద్యోగులను ఎయిర్ టెల్ ఎప్పడూ కుల, మతాలతో వేరు చేయదని కంపెనీ ట్వీట్ చేసింది.

Similar News