బెల్లి లొల్లిని కట్టడి చేస్తారా..?

Update: 2018-07-25 08:32 GMT

బెల్లి ఇప్పుడంతా ఇదే లొల్లి..ఎక్కడ చూసినా ఇదే చిట్ చాట్... సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియోలు... కాసులు కురిపిస్తున్న ఈ డ్యాన్స్ లపై బడా ఈవెంట్ మేనేజర్ల కన్నుపడింది. శివార్లలో ఈ తరహా ప్రోగ్రామ్స్ పెట్టేందుకు సిద్ధమైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే కొంత ముట్టజెప్పిన ఆ మేనేజర్లు ఈవెంట్లకు సిద్ధమైనారని తేలింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఆయా మేనేజర్ల లిస్టు సేకరించే పనిలో పడ్డారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ డ్యాన్స్ లను యూత్ తెగ ఎగబడి మరీ చూస్తున్నారు.

బెల్లిపై సీపీ సీరియస్...

ఇక ఈవెంట్స్ మేనేజర్స్ వాటి పైనే ఆసక్తి చూపుతున్నారు. శివారు ప్రాంతాల్లో ఇలాంటి డ్యాన్స్ లు నిర్వహిస్తే రెండు చేతులా సంపాదించవచ్చని భావిస్తున్నారు. వీరి ఆలోచనలా ఇలా ఉంటే వారి ఎత్తులను చిత్తు చేయాలని పోలీసులు సిద్ధమైనారు. సిటీలో ఉన్న పాపులర్ ఈవెంట్స్ మేనేజర్ల లిస్టు సేకరించిన పోలీసులు వారి కాల్ డేటాలపై కన్నేశారు. సిటీలో ఉన్న విదేశీ వనితల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇటీవల చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నోరి ఫంక్షన్ హాలులో ఓ పెళ్లి వేడుకలో రష్యన్ డ్యాన్సర్లను ప్రత్యేక విమానంలో రప్పించి బెల్లి డ్యాన్స్ నిర్వహించారు. తెల్లవార్లూ సాగిన ఈ డ్యాన్సుల్లో ఓ పార్టీకి చెందిన పెద్దలు ఉండటంతో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. తదనంతరం ఈ ఘటనపై ఆరా తీసిన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అధికారులపై సీరియస్ అయ్యారు. ఆ ఏరియా సెక్టర్ ఎస్ఐతో సహా కిందిస్థాయి సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.

ముందే అలెర్ట్ అయిపోయారు...

సీపీ సీరియస్ కావడంతో రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు ఫంక్షన్ హాల్ నిర్వహకులతో పాటు, పెళ్లి కొడుకుతో సహా 9 మందిని అరెస్టు చేసి జైలుకి తరలించారు. అంతే కాకుండా తమ ప్రాంతంలో ఉన్న మిగతా ఫంక్షన్ హాల్ నిర్వహకులను పిలిచి క్లాస్ పీకారు. ఇదిలావుంటే గతంలో సిటీలో రేయిన్ డ్యాన్స్, ముజ్రా పార్టీలు యూత్ ని హోరెత్తించాయి. దీనిపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో చాలా మంది ఈవెంట్ మేనేజర్లకు పనిలేకుండా పోయింది. రష్యన్ డ్యాన్సర్లతో సాగిన బెల్లి డ్యాన్స్ ని స్వయంగా తిలకించిన ఈవెంట్ మేనేజర్లు దానిపై జనాలకున్న ఆసక్తిని క్యాష్ చేసుకోవాలి చూస్తున్నట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో ఈ తరహా వేడుకలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పెళ్లి వేడుకకి వచ్చిన రష్యన్స్ డ్యాన్సర్లకు చాలా మంది ఈవెంట్ మేనేజర్లు ముందుగానే ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు, వారికి కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యారు. మరోసారి సీపీ ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ముందుగానే ఇలాంటి ఈవెంట్స్ ని కట్టడి చేయాలని డిసైడ్ అయ్యారు. సిటీలో పేరుమోసిన ఈవెంట్ మేనేజర్ల ఫోన్ నెంబర్లు సేకరించి వారి కాల్ డేటా పరిశీలిస్తున్నారు. గతంలో అరెస్టై జైలుకి వెళ్లి వచ్చిన వారిపై నిఘా పెట్టారు. అంతేకాకుండా ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాలు, కార్పొరేట్ కళాశాలల విద్యార్థులపై కూడా నిఘా పెంచారు. బెల్లి సంస్కృతి సిటీని షేక్ చేయకముందే రెయిన్ డ్యాన్స్, ముజ్రా తరహాలో బెల్లిని కూడా తరిమివేయాలన్నది పోలీసుల ఆలోచన.

Similar News