విపక్షాల ఐక్యతకు కలిసి వచ్చిన ఈవీఎంలు

Update: 2018-08-02 13:54 GMT

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా మోదీని గద్దె దించాలనే లక్ష్యంతో విపక్షాలు ఐక్యమవుతున్నాయి. వీరి ఐక్యతకు ఈవీఎంలు కలిసివచ్చాయి. ఈవీఎంలపై అనుమానాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. ఎన్నికల్లో ఓడిపోయిన ఇంచుమించు అన్ని పార్టీలు, అభ్యర్థులు ఈవీఎంలను నిందిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చొరవతో విపక్షాలన్నీ ఈ డిమాండ్ తో ఏకతాటిపైకి వస్తున్నాయి.

మాకు బ్యాలెట్ ఎన్నికలే కావాలి

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, జేడీఎస్, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలన్నీ ఈ డిమాండ్ తో ముందుకొచ్చే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే మమతా సోనియా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ వంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చించారు. మొత్తం 17 పార్టీలు ఈ డిమాండ్ తో ఏకతాటిపైకి వచ్చేలా మమతా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరనున్నారు. అయితే, ఈవీఎంలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు ఈవీఎంలు వద్దంటుండటం గమనార్హం.

Similar News