ప్రధాని హత్యకు కుట్ర కోణంలో తెలుగు వ్యక్తి..?

Update: 2018-06-08 12:05 GMT

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగిందనే వార్త సంచలనంగా మారింది. పూణేలో అరెస్టైన ఐదుగురు వ్యక్తులు మావోయిస్టుల సానుభూతిపరులని, వారే నరేంద్ర మోడీ హత్యకు కుట్రపన్నారని పూణే పోలీసులు ఓ లేఖను కోర్టుకు సమర్పించారు. ఈ లేఖ అరెస్టైన ఐదుగురిలో ఒకరైన విల్సన్ ల్యాప్ టాప్ లో దొరికిందని పోలీసులు తెలిపారు. మోడీని హత్య చేసేందుకు రాజీవ్ హత్య తరహా ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లు, ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పడతాయని లేఖలో ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ లేఖలో తెలుగు వ్యక్తి, విరసం నేత వరవరరావు పేరు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ కుట్రలో వరవరరావు సహకారంతో డబ్బు సర్దుబాటు చేయాలని ప్రస్తావించారు. దీంతో పూణే పోలీసులు వరవరరావును కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.

ప్రధానిని హతమార్చే శక్తి మావోలకు ఉందా..?

ప్రధాని హత్యకు కుట్ర లేఖలో తన పేరు ఉండటంపై వరవరరావు స్పందించారు. తనకు పూణేలో అరెస్టైన వారు తెలుసని, కానీ, వారు పీడిత ప్రజల హక్కులు, రాజకీయ ఖైదీల విడుదల కోసమే పనిచేస్తున్నారని, పారదర్శకంగా జీవించే అటువంటి వ్యక్తులు ఇలాంటివి చేసే అవకాశమే లేదని పేర్కొన్నారు. తాము ఇక్కడ పనిచేస్తున్నట్లుగా అరెస్టైన వారు కూడా వారివారి రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. విల్సన్ తనకు జేఎన్ యూ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే పరిచయమని స్పష్టం చేశారు. అయితే, చంపడం అనే దానికి తాము వ్యతిరేకమని, మావోలు కూడా ఇది వీడాలని తాము కోరుతున్నామన్నారు. మావోయిస్టులకు ప్రధానిని చంపే శక్తి ఉందా అని ప్రశ్నించారు. ఇటీవల మోదీ గ్రాఫ్ తగ్గుతుందని, ఆయన ఇమేజ్ ను పెంచే చర్యగా ఈ కుట్రను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివాసీలు, దళితులు, పీడిత ప్రజలు, ముస్లిం మైనారిటీల గురించి మాట్లాడుతున్న వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ఈ కుట్ర చేస్తుందన్నారు. మహా అయితే తనను కూడా అరెస్టు చేస్తారని, అంతకంటే ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు.

Similar News